Google PlayStore: ఫోన్‌లో ఈ రెండు యాప్‌లు ఉన్నాయా? వెంటనే తొలగించండి!

గూగుల్‌ ప్లేస్టోర్‌ (Google PlayStore)లోని రెండు యాప్‌లు నిబంధనలకు విరుద్ధంగా యూజర్ల నుంచి డేటా సేకరించి చైనా సంస్థలకు చేరవేస్తున్నాయని ప్రాడియో (Pradeo) అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.

Updated : 10 Jul 2023 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్ల డేటా భద్రత కోసం గూగుల్(Google) గతేడాది ఆధునిక ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో గూగుల్‌ ప్లేస్టోర్‌ (PlayStore)లో యాప్‌లు యూజర్ల నుంచి ఏయే సమాచారం సేకరిస్తున్నాయనేది డేటా సేఫ్టీ(Data Safety) అనే సెక్షన్‌లో వెల్లడించాలి. యూజర్‌ గోప్యత కోసం ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు గూగుల్ తెలిపింది. అయితే, కొందరు యాప్‌ డెవలపర్లు, హ్యాకర్లు యూజర్‌ డేటాను దొంగలించేందుకు కొత్త పంథాను ఎంచుకున్నట్లు ప్రాడియో (Pradeo) అనే మొబైల్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. 

ప్లేస్టోర్‌లో యాప్‌ వివరాల్లో డేటా సేకరించట్లేదని చెబుతూ.. యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని చైనాలోని సంస్థలకు చేరవేస్తున్నాయని ప్రాడియో తెలిపింది. చైనాకు చెందిన వాంగ్ టామ్‌ (Wang Tom) అనే డెవలపర్‌ డిజైన్‌ చేసిన ఫైల్‌ రికవరీ అండ్ డేటా రికవరీ (File Recovery and Data Recovery), ఫైల్‌ మేనేజర్‌ (File Manager) అనే రెండు యాప్‌లు యూజర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, లొకేషన్‌, మొబైల్‌ కంట్రీ కోడ్‌, నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ నేమ్‌, నెట్‌వర్క్‌ కోడ్‌, పోన్‌ తయారీ కంపెనీ, మోడల్‌ వంటి వివరాలను సేకరిస్తూ.. యాప్‌లో యూజర్ల యాక్టివిటీలపై నిఘా ఉంచినట్లు నివేదికలో పేర్కొంది.

ఇప్పటి వరకు ఈ రెండు యాప్‌లను సుమారు 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. యూజర్లు వెంటనే ఈ యాప్‌లను తమ డివైజ్‌ల నుంచి డిలీట్ చేయాలని సూచించింది. అయితే, ఈ యాప్‌లు గూగుల్‌ ప్లేస్టోర్‌ సెక్యూరిటీ చెక్‌ (Security Check)లో నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నామని పేర్కొనడం గమనార్హం. ఇలాంటి యాప్‌ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సూచించింది. గతేడాది ఇదే డెవలపర్‌ రూపొందించిన కార్టూనిఫైయర్‌ అనే యాప్‌ ఫేస్‌బుక్‌ యూజర్ల లాగిన్‌ వివరాలు సేకరిస్తుందనే కారణంతో ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది. తాజాగా, ఈ రెండు యాప్‌లపై నిషేధం విధించింది. డౌన్‌లోడ్స్‌ సంఖ్య ఎక్కువగా ఉండి, రివ్యూలులేని యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం ఉత్తమమని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని