అదానీ పోర్ట్స్‌ ఆడిట్‌ బాధ్యతల నుంచి డెలాయిట్‌ ఔట్‌..? ఆ లావాదేవీలే కారణమా?

Adani group: అదానీ గ్రూప్‌ ఆడిటింగ్‌ బాధ్యతల నుంచి డెలాయిట్‌ వైదొలగనుంది. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Published : 11 Aug 2023 20:06 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌నకు (Adani group) చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ (APSEZ) ఆడిటింగ్‌ వ్యవహారాలు చూస్తున్న డెలాయిట్‌.. ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించిట్లు తెలుస్తోంది. ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని లావాదేవీలపై కొన్నాళ్ల క్రితం డెలాయిట్‌ (Deloitte) ఆందోళన వ్యక్తంచేసింది. గతంలో ఇవే లావాదేవీల గురించి హిండెన్‌బర్గ్‌ సైతం తన నివేదికలో ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆడిటర్‌ బాధ్యతల నుంచి వైదొలగాలని డెలాయిట్‌ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ఎల్‌ఎల్‌పీ నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలాయిట్‌ వైదొలగడానికి అసలు కారణమేంటనేది ఇప్పటికిప్పుడు తెలియరాలేదు. దీనిపై డెలాయిట్‌ స్పందించేందుకు నిరాకరించింది.

అదానీ పోర్ట్స్‌కు సంబంధించిన మూడు లావాదేవీలపై డెలాయిట్‌ ఈ ఏడాది మే నెలలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. 2022-23 ఆర్థిక సంవత్సరం, నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆడిటింగ్‌ రిపోరర్ట్‌లో ఈ మూడు లావాదేవీలను ప్రస్తావించింది. ఆ మూడు లావాదేవీలను కంపెనీకి సంబంధం లేని పార్టీలుగా పేర్కొంది. అయితే, దీన్ని నిరూపించేందుకు స్వతంత్ర బాహ్య పరిశీలన అవసరమని పేర్కొనగా.. అందుకు అదానీ గ్రూప్ నిరాకరించినట్లు డెలాయిట్‌ వెల్లడించింది. దీంతో తాము కంపెనీ ప్రకటనను ధ్రువీకరించలేమని తెలిపింది.

ఉల్లి ధరలు నియంత్రించడానికి కేంద్రం చర్యలు.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌

ఈ ఏడాది జనవరి 24న అదానీ గ్రూప్‌నకు సంబంధించి అమెరికాకు చెందిన హిండన్‌బర్గ్‌ రీసెర్చి సంస్థ ఓ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ స్టాక్‌ ధరల్లో మోసం, మనీ లాండరింగ్‌కు పాల్పడుతోందంటూ పలు ఆరోపణలు చేసింది. దీంతోపాటు అదానీ గ్రూప్‌ కంపెనీలకు సంబంధించిన కొన్ని లావాదేవీలనూ తన నివేదికలో ప్రస్తావించింది. అప్పట్లో ఆ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. డెలాయిట్‌ కోరిన స్వతంత్ర బాహ్య పరిశీలనకు నిరాకరించింది. తమ గ్రూప్‌పై సెబీ దర్యాప్తు చేస్తున్నందున బాహ్య పరిశీలన అవసరం లేదని పేర్కొందంటూ డెలాయిట్‌ తెలిపింది. దీంతో ఏపీ సెజ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌లో తమ ఆడిట్‌కు సంబంధించి తగిన సాక్ష్యాలు సమర్పించలేదంటూ డెలాయిట్‌ పేర్కొంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ గ్రూప్‌లో ఎలాంటి అవతవకలూ గుర్తించలేదని మధ్యంతర నివేదికలో పేర్కొనగా.. సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆగస్టు 14లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డెలాయిట్‌ రాజీనామా వ్యవహారం తెరపైకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని