Budget 2023: వేతన జీవుల వెతలు.. బడ్జెట్‌లో దొరికేనా ఉపశమనం..?

Budget 2023: బడ్జెట్‌ 2023పై వేతనజీవులు అనేక ఆశలు పెట్టుకున్నారు. తొలగింపులు, మూన్‌లైటింగ్‌ వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Updated : 25 Jan 2023 10:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర బడ్జెట్‌ 2023కి (Budget 2023) కాలం సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2022లో ఉద్యోగులకు కష్టంగానే గడిచింది. తొలగింపులు, వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి తిరిగి ఆఫీసులకు వెళ్లడం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల వంటి పరిణామాలు వేతన జీవులను ఆందోళనకు గురిచేశాయి. వీటిలో కొన్ని ఇబ్బందులు ఈ ఏడాది కూడా కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ (Budget 2023)లో వేతనజీవుల వెతలను కాస్తయినా తగ్గించే ప్రకటనలు ఉండాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగ కల్పనపై దృష్టి..

ప్రైవేటు సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి (Layoffs). మాంద్యం భయాలు బలపడుతున్న నేపథ్యంలో కొత్త నియామకాలు సైతం నిలిచిపోతున్నాయి. మరోవైపు ధరలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌ (Budget 2023)లో ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అసవరం ఉంది. మూలధన వ్యయాన్ని పెంచి వృద్ధికి ఊతమివ్వడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశాలను పరిశీలించాలి. గ్రామీణ, టైర్‌-2, టైర్‌-3, టైర్‌-4 ప్రాంతాల్లోని మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులను పెంచాలి.

కంపెనీలకు ప్రోత్సాహకాలు..

ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 80జేజేఏఏ ప్రకారం.. అదనంగా నియమించుకున్న ఉద్యోగుల ఖర్చులపై పన్ను మినహాయింపు పొందేందుకు కంపెనీలకు అవకాశం ఉంది. దీంట్లోని పరిమితుల్ని తొలగించి మరింత ఎక్కువ మందికి కంపెనీలు ఉద్యోగాలు కల్పించేలా ప్రోత్సహించాలని నిపుణులు అంటున్నారు. మరోవైపు అంకుర సంస్థలకు మరిన్ని ప్రోత్సాహకాలను అందించడం ద్వారానూ ఉద్యోగ కల్పనకు కృషి చేయొచ్చు.

నిబంధనలు కట్టుదిట్టం..

ఉద్యోగులను సంస్థలు అర్ధాంతరంగా తొలగించడం, ఉద్యోగుల క్వైట్‌ క్విట్టింగ్‌, మూన్‌లైటింగ్‌ సాధారణంగా మారుతున్న నేపథ్యంలో పనిప్రదేశాల్లో విధానాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేవారికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. అలాగే మూన్‌లైటింగ్‌ నేపథ్యంలో పన్ను ఎలా వర్తిస్తుందనే అంశంపై మరింత స్పష్టత తీసుకురావాలి. మరోవైపు కంపెనీలు ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సామాజిక భద్రత ఉండేలా.. కంపెనీలకు స్పష్టమైన విధానాలను ప్రభుత్వం నిర్దేశించాల్సి ఉంది.

చిన్న కంపెనీలకు ప్రాధాన్యం..

దేశంలో ఉద్యోగ కల్పనలో తక్కువ మూలధనంతో నడిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ జీడీపీలో మూడో వంతు వాటా వీటిదే. ఉద్యమ్‌ పోర్టల్‌లోని వివరాల ప్రకారం.. 2021- 22లో ఎంఎస్‌ఎంఈల్లో 93,94,957 మంది పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది అసంఘటిత రంగంలో ఉన్నవాళ్లే. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్‌ వంటి పింఛను పథకాలతో పాటు ఇతర ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ వంటి సామాజిక భద్రత వ్యవస్థలను వీరికి వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగ కల్పనను మరింత ప్రోత్సహించేలా ఎంఎస్‌ఎంఈలకు సైతం మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

నైపుణ్యానికి ప్రోత్సాహం..

భారత్‌లో నిరుద్యోగానికి గల ప్రధాన కారణాల్లో నైపుణ్యలేమి ఒకటి. ఈ నేపథ్యంలో చిన్న చిన్న ఉద్యోగులు, అసంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు తమ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ట్రైనింగ్‌ కోర్సులు, లెర్నింగ్‌ సబ్‌స్క్రిప్షన్లను పన్ను మినహాయింపుల పరిధిలోకి తీసుకురావాలి.

పన్నుల్లో ఊరట..

ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో వేతనజీవులే సింహభాగం. 2022లో ఐటీఆర్‌ దాఖలు చేసిన వారిలో 50 శాతం మంది ఉద్యోగులే. ఈ నేపథ్యంలో కనీస పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందని వేతన జీవులు కోరుతున్నారు. తద్వారా చిరుద్యోగుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం సైతం ఎగబాకుతుంది. మరోవైపు గృహరుణంపై ఉన్న పన్ను మినహాయింపుల పరిమితి సైతం పెంచితే ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను విషయంలో ఏకీకృత విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫలితంగా ఉద్యోగుల పొదుపులు పెరిగి పెట్టుబడులు సైతం ఎగబాకే అవకాశం ఉంటుంది.

పిల్లల సంరక్షణ ఖర్చులకు మినహాయింపులు..

ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల పోషణ కష్టతరంగా మారింది. ముఖ్యంగా విద్య, వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణ ఖర్చులకు కూడా పన్ను మినహాయింపు వర్తింపజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. బీమా ప్రీమియంల తరహాలోనే వీటికి కూడా పన్ను రాయితీలు ప్రకటించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం విద్యా అలవెన్సు కింద తొలి బిడ్డపై నెలకు రూ.100, రెండో చైల్డ్‌పై నెలకు రూ. 300 వరకు మినహాయింపునిస్తున్నారు. దీన్ని మరింత పెంచడంతో పాటు ఇతర ప్రధాన ఖర్చులకు కూడా వర్తింపజేయడం ద్వారా ఉద్యోగులకు ఊరట కల్పించొచ్చు.

కార్మిక చట్టాలపై క్లారిటీ..

కార్మిక చట్టాల అమలు విషయంలో ఈ ఏడాది విస్తృతంగా చర్చ జరిగింది. ఉద్యోగుల పనివేళలు, పని గంటలు, వేతనాలు, సెలవులపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఓ స్పష్టతనిచ్చి.. వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇటు ఉద్యోగులతో పాటు అటు కంపెనీలకు కూడా చట్టాలు ప్రయోజనకరంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

బడ్జెట్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని