Updated : 13 Aug 2022 06:31 IST

ఎల్‌ఐసీ లాభం రూ.683 కోట్లు

ముంబయి: ప్రభుత్వరంగ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) జూన్‌ త్రైమాసికానికి రూ.682.89 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.2.94 కోట్లే కావడం గమనార్హం. ఇదే సమయంలో తొలి ప్రీమియం వసూళ్లు రూ.5088 కోట్ల నుంచి రూ.7429 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.1,54,153 కోట్ల నుంచి రూ.1,68,881 కోట్లకు పెరిగింది. అయితే ఈ ఏడాది జనవరి-మార్చి లాభం రూ.2371 కోట్లు, ఆదాయం రూ.2,11,451 కోట్లతో పోలిస్తే మాత్రం ఏప్రిల్‌-జూన్‌లో తగ్గాయి.


శాంసంగ్‌ వారసుడికి క్షమాభిక్ష

 జైలు నుంచి విముక్తి

ఇక పూర్తి స్థాయిలో వ్యాపారంపై దృష్టి

సియోల్‌: దేశ మాజీ అధ్యక్షుడికి లంచం ఇచ్చిన కేసులో దోషిగా తేలి, జైలు శిక్ష ఎదుర్కొంటున్న శాంసంగ్‌ ఎలక్టాన్రిక్స్‌ వైస్‌ ఛైర్మన్‌ లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది. జైలు శిక్ష నేపథ్యంలో విధించిన ఉద్యోగపరమైన ఆంక్షలు కూడా తొలగిపోనున్నాయి. త్వరలోనే యాంగ్‌ సామ్‌సంగ్‌ కంపెనీ బోర్డులో చేరి, పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు.
దేశావసరాల దృష్ట్యానే.. లంచం కేసులో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన లీ జే యాంగ్‌కు.. కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించింది. దేశ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని జైల్లో ఉన్న వ్యాపార ప్రముఖులకు.. ఇలా కేసుల నుంచి విముక్తి కల్పించడం దక్షిణ కొరియాలో ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఆగస్టు 15న దక్షిణ కొరియా లిబరేషన్‌ డే సందర్భంగా దాదాపు 1700 మంది దోషులకు అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌ క్షమాభిక్ష పెట్టనున్నారు. ఇందులో జే యాంగ్‌తో పాటు  ప్రముఖ వ్యాపారవేత్తలు షిన్‌ డాంగ్‌ బిన్‌, ఛాంగ్‌ సే-జూ, కాంగ్‌ డూక్‌-సూ పేర్లు కూడా ఉన్నాయి.

ఇదీ జరిగింది..: 54 ఏళ్ల లీ జే యాంగ్‌.. శాంసంగ్‌ గ్రూప్‌ అధినేత లీ కున్‌ హీ పెద్ద కుమారుడు. ఆయనకు వారసుడైన యాంగ్‌, శాంసంగ్‌ ఎలక్టాన్రిక్స్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లంచం కేసులో 2017లో  యాంగ్‌ అరెస్టయ్యారు. శాంసంగ్‌కు చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు 2015లో అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై లీ జే యాంగ్‌ను అరెస్టు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం జే యాంగ్‌కు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కుంభకోణం బయటపడ్డాక, అప్పటి పార్క్‌ ప్రభుత్వం కూలిపోయింది. తనకు విధించిన శిక్షపై జే యాంగ్‌ అప్పిలేట్‌ కోర్టును ఆశ్రయించగా.. 2018లో కోర్టు ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం దక్షిణ కొరియా సుప్రీంకోర్టుకు చేరగా.. లీ జే యాంగ్‌కు రెండున్నర ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఆయన.. గతేడాది ఆగస్టులో పెరోల్‌పై బయటకు వచ్చారు. లంచం కేసు రీత్యా విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటివరకు కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతల నుంచి లీ జే యాంగ్‌ దూరమయ్యారు. (జైలులో ఉన్నా.. అక్కడి నుంచే శాంసంగ్‌ను నడిపించారని విమర్శకులు అంటుంటారు.) తాజాగా ఆయనకు క్షమాభిక్షతో త్వరలోనే తండ్రి వారసత్వాన్ని అందుకుని కంపెనీ పగ్గాలు చేపట్టే అవకాశముంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని