ముందస్తు చెల్లింపులు చేసిన గంటల్లోనే స్పెక్ట్రమ్‌ కేటాయిస్తూ లేఖ

స్పెక్ట్రమ్‌ కోసం ముందస్తు చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే, స్పెక్ట్రమ్‌ కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి లేఖ అందిందని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు,

Published : 19 Aug 2022 03:19 IST

సులభతర వ్యాపార ప్రక్రియపై సునీల్‌ మిత్తల్‌ ప్రశంసలు

దిల్లీ: స్పెక్ట్రమ్‌ కోసం ముందస్తు చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే, స్పెక్ట్రమ్‌ కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి లేఖ అందిందని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ తెలిపారు. ముందస్తు చెల్లింపు చేసిన రోజునే స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖను ఇవ్వడం టెలికాం విభాగం (డాట్‌) చరిత్రలోనే ఇది తొలిసారి. ‘స్పెక్ట్రమ్‌ కోసం ఎయిర్‌టెల్‌ రూ.8,312.40 కోట్లు చెల్లించింది. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ కేటాయిస్తూ గంటల వ్యవధిలోనే లేఖ ఇచ్చారు.   ఇ బ్యాండ్‌ కూడా కేటాయించారు. సులభతర వ్యాపార ప్రక్రియ అద్భుతంగా అమలవుతోంద’ని మిత్తల్‌  తెలిపారు. ఇటీవలి వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌ కోసం టెలికాం విభాగానికి భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్‌, వొడాఫోన్‌ ఐడియాలు రూ.17,876 కోట్లు చెల్లించాయి.  ‘30 ఏళ్లకు పైగా నా అనుభవంలో టెలికాం విభాగం నుంచి ఇంత వేగవంతమైన స్పందనను మొదటిసారి చూశాను. వ్యాపారం అంటే ఇలాగే ఉండాలి. ఇలాంటి మార్పులు దేశాన్ని మార్చేస్తాయి. అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే కలను సాకారం చేసేందుకు మరింత ఊతమిస్తాయ’ని మిత్తల్‌ అన్నారు. ముందస్తు చెల్లింపులు చేసిన ఇతర టెలికాం కంపెనీలకు కూడా స్పెక్ట్రమ్‌ కేటాయిస్తూ లేఖలను టెలికాం విభాగం జారీ చేస్తోంది. దీనిపై కేంద్ర టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్‌ స్పందిస్తూ ‘స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖలు అందాక.. 5జీ సేవల ప్రారంభాన్ని వేగవంతం చేయాలని టెలికాం సంస్థలను కోరుతున్నట్లు’ తెలిపారు.


డాక్టర్లకు రూ.1000 కోట్లు ఇచ్చిన ‘డోలో’

రోగులకు తమ మాత్రలే రాసినందుకు తాయిలాలు
 కంపెనీపై ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఏఐ ఆరోపణలు

డోలో-650 మాత్రల తయారీ సంస్థపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పలు ఆరోపణలు చేసింది. ఈ మాత్రలను రోగులకు రాసిన డాక్టర్లకు రూ.1,000 కోట్ల వరకు తాయిలాలను పంచిపెట్టిందని పేర్కొంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెప్రెజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఏఐ) - యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఏఐ తరఫు న్యాయవాది సంజయ్‌ పారిఖ్‌ మాట్లాడుతూ ‘డోలోను రాసేలా సదరు కంపెనీ ‘ఉచితాల’ కోసం పెట్టుబడులు పెట్టింద’ని బార్‌ అండ్‌ బెంచ్‌(బీ అండ్‌ బీ)ను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఈ విషయమై న్యాయవాది అపర్ణా భట్‌ ద్వారా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) కోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే. యూనిఫామ్‌ కోడ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ మార్కెటింగ్‌ ప్రాక్టీసెస్‌(యూసీపీఎమ్‌పీ) ద్వారా తమకు చట్టబద్ధ మద్దతు కావాలని ఆ పిల్‌ కోరింది. ఆరోగ్యంగా ఉండే హక్కు అనేది జీవించే హక్కులో భాగమేనని.. ఫార్మా కంపెనీలు నైతిక మార్కెటింగ్‌ విలువను పాటించాలని ఆ వ్యాజ్యంలో కోరినట్లు తెలుస్తోంది. ‘ఇది తీవ్రమైన సమస్య. ఇది నా చెవులకేమీ ఇంపుగా అనిపించడం లేదు. నాకు కొవిడ్‌ వచ్చినపుడు నన్నూ ఇవే మాత్రలు వేసుకోమన్నార’ని న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై 10 రోజుల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్‌లో ఫార్మా మార్కెటింగ్‌ ధోరణులపై నియంత్రణ లేకపోవడంతో, అవినీతి చోటుచేసుకుంటోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో వీటిపై ఎటువంటి చట్టమూ లేదు. బ్రాండెడ్‌ ఔషధాలను ‘ఎక్కువగా రాసివ్వడం’ లేదంటే ‘హేతువిరుద్ధంగా ఇవ్వడం’ వల్ల రోగులే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని.. వారి ప్రాణాలకు, ఆరోగ్యానికి ఇది చేటు చేస్తుందని పిటిషనర్‌ వాదించారు. కాగా, ఇప్పటికే ప్రభుత్వం ఒక ముసాయిదా యూసీపీఎమ్‌పీని విడుదల చేసింది. విచారణ అనంతరం ప్రజల నుంచి త్వరలోనే స్పందనలను కోరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని