త్వరలో ఐఐఎల్‌ నుంచి చేపలకు టీకా

చేపలకు అనువైన టీకాలను హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) త్వరలో ఆవిష్కరించనుంది.

Updated : 29 Nov 2022 01:53 IST

దేశంలోనే తొలిసారి
రైతుల ఆదాయం పెరిగే అవకాశం
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేషన్‌తో ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: చేపలకు అనువైన టీకాలను హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) త్వరలో ఆవిష్కరించనుంది. ఇందు కోసం సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేషన్‌-ముంబయి(సీఐఎఫ్‌ఈ)తో ఈ సంస్థ  ఒప్పందం కుదుర్చుకుంది. మంచి నీటి సరస్సుల్లో పెరిగే చేపలకు సర్వసాధారణంగా బ్యాక్టీరియల్‌ వ్యాధులు సోకుతుంటాయి. ఇటువంటి వ్యాధులను నివారించేందుకు అనువైన చేపల టీకాలను వాణిజ్య ప్రాతిపదికన తీసుకువచ్చేందుకు ఐఐఎల్‌ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం రెండు రకాలైన ఇన్‌-యాక్టివేటెడ్‌ బ్యాక్టీరియల్‌ టీకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐఎల్‌కు సీఐఎఫ్‌ఈ అందిస్తుంది. ఇందులో ఒక టీకా కొలూమనరీస్‌ వ్యాధికి ఉద్దేశించింది కాగా.. మరొకటి ఎడ్వర్డ్‌సీల్లోసిస్‌ వ్యాధిని అదుపు చేసే టీకా. ఈ రెండు వ్యాధుల వల్ల చేపల రైతులు ఎంతగానో నష్టపోతూ ఉంటారు.

ఆక్వాకు అండగా..

ఐఐఎల్‌ కొంత కాలం క్రితం ఆక్వాకల్చర్‌ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే. తాజాగా చేపల టీకాలు తీసుకురానుంది. తద్వారా మన దేశంలో చేపల టీకాలు ఆవిష్కరించనున్న తొలి సంస్థగా గుర్తింపు పొందనుంది. ఇటీవల కాలంలో తాము ఎన్నో వెటర్నరీ టీకాలు తీసుకువచ్చినట్లు, ఇప్పుడు ఆక్వాకల్చర్‌ మార్కెట్‌పై దృష్టి సారించినట్లు ఐఐఎల్‌ ఎండీ డాక్టర్‌ కె.ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. తద్వారా చేపలు, రొయ్యల పెంపకంలో నిమగ్నమై ఉన్న రైతులకు అండగా నిలుస్తామని వివరించారు.

రసాయనాల వినియోగం తగ్గుతుంది

చేపల ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్తంగా  మనదేశం మూడో స్థానంలో ఉంది. దాదాపు 2.80 కోట్ల మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తోంది. చేపలు, రొయ్యల ఎగుమతుల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో మనదేశం 7.76  బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. చేపలు, రొయ్యలకు సోకే జబ్బులను సమర్థంగా నివారించగలిగితే ఈ రంగం నుంచి ఇంకా అధిక ఆదాయాలు లభిస్తాయని సీఐఎఫ్‌ఈ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.ఎన్‌. రవిశంకర్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ జబ్బుల నివారణకు యాంటీ-ఇన్ఫెక్టివ్స్‌ వినియోగిస్తున్నారని, కానీ ఆహారోత్పత్తుల్లో రసాయనాల వినియోగంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో జబ్బులను అరికట్టాల్సి ఉందని అన్నారు. ఇందుకు టీకాలు ఒక మార్గమని తెలిపారు. మనదేశంలో ఇప్పటి వరకూ చేపల టీకాలు లేవని, తొలిసారిగా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని