సంక్షిప్త వార్తలు (5)

ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని ఐటీ యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు 2023 డిసెంబరు వరకు పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Published : 09 Dec 2022 03:55 IST

100% ఇంటి నుంచి పనికి అనుమతి
ఎస్‌ఈజడ్‌ ఐటీ యూనిట్లలో ఉద్యోగులకే

దిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని ఐటీ యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు 2023 డిసెంబరు వరకు పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెజ్‌ల నిబంధనలను సవరించడంతో అక్కడి ఐటీ/ఐటీఈఎస్‌ యూనిట్లలోని ఉద్యోగులు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు కొన్ని షరతులతో ఇంటి నుంచే పని చేసే అవకాశం లభించింది. తమ ఉద్యోగులకు ఆయా యూనిట్లు ఇంటి నుంచి పని చేసేందుకు లేదా సెజ్‌ బయటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇస్తాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ఇతర పరికరాలను ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులకు ఆయా యూనిట్లు అందించనున్నాయి. గతంలో సెజ్‌లోని ఐటీ యూనిట్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు గరిష్ఠంగా ఒక ఏడాది, అందులోనూ గరిష్ఠంగా మొత్తం ఉద్యోగుల్లో 50% మందికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం 100% ఉద్యోగులకు వచ్చే ఏడాది డిసెంబరు ఆఖరు వరకు ఈ సదుపాయం కల్పించారు.


సాంకేతిక అంకురాలతో శామ్‌సంగ్‌ జట్టు

దిల్లీ: దేశంలో తమ డిజిటల్‌ ప్రయాణాన్ని వేగవంతం చేసుకునేందుకు, ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా అప్లికేషన్ల చుట్టూ ఉన్న సాంకేతికతలపై పని చేసే అంకురాలతో భాగస్వామ్యం కానున్నట్లు కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ గురువారం వెల్లడించింది. యూపీఐ, డిజిలాకర్‌ ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ), ఓపెన్‌ క్రెడిట్‌ ఎనేబుల్‌మెంట్‌ నెట్‌వర్క్‌ (ఓసీఈఎన్‌), యూనిఫైడ్‌ హెల్త్‌ ఇంటర్‌ఫేస్‌ (యూహెచ్‌ఐ) వంటి సాంకేతికతలపై సహకరించడానికి అంకురాలను ఆహ్వానిస్తున్నట్లు శామ్‌సంగ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా అంకురాలు వాలెట్‌, హెల్త్‌, ఫిట్‌నెస్‌ వంటి డొమైన్లలో దేశంలోని శామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు, వ్యాపార విభాగాలతో భాగస్వామ్యం కలిగి ఉంటాయని తెలిపింది. ఇక్కడ ఉత్పత్తులు, సేవలు కంపెనీతో అనుసంధానమై ఉంటాయని పేర్కొంది.


సొనాలికా ట్రాక్టర్స్‌ లక్ష విక్రయాల రికార్డు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మొదటి 8 నెలల్లో మొత్తం లక్ష ట్రాక్టర్‌లను విక్రయించినట్లు సొనాలికా ట్రాక్టర్స్‌ ప్రకటించింది. కంపెనీకి ఇది అత్యంత వేగవంతమైన విక్రయాలు కావడం విశేషం. 2021-22 ఏప్రిల్‌-నవంబరుతో పోలిస్తే కంపెనీ 11.2 శాతం వృద్ధిని సాధించింది. పరిశ్రమ వృద్ధి అంచనాలు 8.8 శాతాన్ని కూడా అధిగమించింది. వరుసగా ఆరేళ్ల(2017-18 నుంచి 2022-23) పాటు సొనాలికా లక్ష ట్రాక్టర్‌ విక్రయాలను నమోదు చేసింది. మొదటిసారిగా 2017-18లో కంపెనీ 12 నెలల్లో లక్ష విక్రయాల మైలురాయిని సాధించింది. కేవలం 8 నెలల్లోనే లక్ష విక్రయాలను అందుకోవడంపై ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ సంయుక్త ఎండీ రమణ్‌ మిత్తల్‌ హర్షం వ్యక్తం చేశారు.


ఇటలీ కంపెనీతో మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ ఒప్పందం

హైదరాబాద్‌: ఇటలీకి చెందిన ఇంటరాక్టివ్‌ ఫుల్లీ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌(ఐ-ఎఫ్‌ఈవీఎస్‌)తో ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని(ఎమ్‌ఓయూ) ఇటీవల కుదుర్చుకున్నట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో హైదరాబాద్‌కు చెందిన మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ గురువారం పేర్కొంది. దీని కింద ఐ-ఎఫ్‌ఈవీఎస్‌కు చెందిన విద్యుత్‌ ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు భారత్‌లో ఏకైక కాంట్రాక్ట్‌ తయారీ/అసెంబ్లీదారుగా మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ వ్యవహరిస్తుంది.


* గోవా కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8 దేశీయ గమ్యస్థానాలకు 168 వారం వారీ విమానాలను నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. జనవరి 5 నుంచి ఈ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను మొదలుపెట్టనుంది.

* ఎస్‌డబ్ల్యూఏఎమ్‌ఐహెఎచ్‌ ఇన్వెస్ట్‌ ఫండ్‌-1లోకి ప్రభుత్వం అదనంగా రూ.5,000 కోట్లను జొప్పించింది. తద్వారా ఒత్తిడిలో ఉన్న ఈ స్థిరాస్తి పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌కు మద్దతిచ్చింది.

* భారత్‌ పే మాజీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు అశ్నీర్‌ గ్రోవర్‌, ఆయన కుటుంబంపై రూ.88.67 కోట్లు కట్టాలంటూ ఆ ఆర్థిక సేవల సంస్థ దావా వేసింది.

* మహిళలకు రుణాలివ్వడం కోసం ఎస్‌వీ క్రెడిట్‌ లైన్‌తో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సహ-రుణ ఒప్పందం కుదుర్చుకుంది.

*  షేర్ల తిరిగి కొనుగోలు(బైబ్యాక్‌)ను చర్చించే ప్రతిపాదన కోసం డిసెంబరు 13న బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు పేటీఎమ్‌ గురువారం పేర్కొంది.

*  దేశంలో తమ డిజిటల్‌ ప్రయాణాన్ని వేగవంతం చేసుకునేందుకు, ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా అప్లికేషన్ల చుట్టూ ఉన్న సాంకేతికతలపై పని చేసే అంకురాలతో భాగస్వామ్యం కానున్నట్లు కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ గురువారం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని