టీడీఎస్‌ అప్పీళ్లను త్వరగా పరిష్కరిస్తాం

మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) డిఫాల్ట్‌లకు సంబంధించిన అప్పీళ్లను సత్వరమే పరిష్కరించేందుకు త్వరలోనే ఒక పథకాన్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు.

Published : 05 Feb 2023 01:38 IST

బడ్జెట్‌ ప్రతిపాదనల అమలు కోసం ప్రత్యేక పథకం:  సీబీడీటీ ఛైర్‌పర్సన్‌

దిల్లీ: మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) డిఫాల్ట్‌లకు సంబంధించిన అప్పీళ్లను సత్వరమే పరిష్కరించేందుకు త్వరలోనే ఒక పథకాన్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో చిన్న అప్పీళ్ల పరిష్కారానికి, పేరుకుపోయిన అప్పీళ్లను తగ్గించేందుకు ఆదాయపు పన్ను శాఖలోని 100 మంది జాయింట్‌ కమిషనర్లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక పథకంతో ముందుకు వస్తున్నట్లు నితిన్‌ గుప్తా వెల్లడించారు. ప్రధానంగా టీడీఎస్‌ను అమలు చేయడంలో వైఫల్యం, టీడీఎస్‌ డిఫాల్ట్‌పై ఆర్డర్లు, రిటర్నుల ప్రాసెసింగ్‌పై ఆర్డర్లు, సర్దుబాట్లు ఇలా పలు అంశాల్లో వివాదాలను పరిష్కరించేందుకు ఈ పథకం తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీనిద్వారా మొదటి అప్పీలేట్‌ అథారిటీ ద్వారా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేస్తామని వివరించారు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్ను విభాగం జారీ చేసిన ఆదేశాలను పన్ను చెల్లింపుదారు, ముందుగా అప్పీల్‌ కమిషనర్‌ దగ్గర సవాలు చేయొచ్చు. ఆ తర్వాత ఇన్‌కంట్యాక్స్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ), హైకోర్టు, సుప్రీంకోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉంది. తొలిదశలోనే అప్పీళ్లను పరిష్కరించేందుకు 100 మంది జాయింట్‌ కమిషనర్లను ప్రత్యేకంగా నియమించబోతున్నట్లు నితిన్‌ గుప్తా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని