కాంపా కోలా మళ్లీ వచ్చేసింది
50 ఏళ్ల కిత్రం నాటి ప్రసిద్ధ పానీయ బ్రాండు ‘కాంపా కోలా’ను సరికొత్త రూపంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ మళ్లీ విపణిలోకి విడుదల చేసింది.
విపణిలోకి తీసుకొచ్చిన రిలయన్స్
50 ఏళ్ల క్రితం నాటి పానీయం ఇది
తొలుత తెలుగు రాష్ట్రాల్లోనే
దిల్లీ: 50 ఏళ్ల కిత్రం నాటి ప్రసిద్ధ పానీయ బ్రాండు ‘కాంపా కోలా’ను సరికొత్త రూపంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ మళ్లీ విపణిలోకి విడుదల చేసింది. గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాఫ్ట్ డ్రింక్స్, పళ్ల రసాల తయారీ సంస్థ సోస్యో హజూరి బేవరేజెస్‌లో 50 శాతం వాటాను రిలయన్స్ రిటైల్‌కు చెందిన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసింది. సోస్కో ఇంతకుమునుపే కాంపా బ్రాండును ప్యూర్ డ్రింక్స్ గ్రూపు నుంచి రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో కాంపా బ్రాండును మళ్లీ కొత్త అవతారంలో రిలయన్స్ రిటైల్ ఆవిష్కరించింది. అదానీ, ఐటీసీ, యునిలీవర్ లాంటి దిగ్గజాలతో పోటీపడే నిమిత్తం సొంత ఉత్పత్తుల శ్రేణిని పెంచుకోవాలన్నదే సంస్థ ఉద్దేశం. ‘కాంపా ఉత్పత్తుల విభాగంలో తొలుత కాంపా కోలా, కాంపా లెమన్, కాంపా ఆరెంజ్‌ను తీసుకొచ్చినట్లు’ కంపెనీ తెలిపింది. తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విపణుల్లో ఈ పానీయం లభ్యమవుతుందని, క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ పేర్కొంది. 200 - 500 - 600 - 1000 - 2000 మిల్లీలీటర్ల ప్యాక్‌లలో ఇవి లభిస్తాయని వివరించింది. వీటి ధరల వివరాలను ప్రకటించలేదు.
మళ్లీ ఆ నినాదంతోనే...
1949- 70 మధ్య భారత్‌లో కోకా- కోలాకు ప్యూర్ డ్రింక్స్ గ్రూపే పంపిణీదారుగా ఉండేది. ఆ తర్వాత 1970లో కాంపా కోలా పేరుతో సొంత బ్రాండును విడుదల చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకే సాఫ్ట్ డ్రింక్స్ విభాగంలో అగ్రగామిగా కూడా అవతరించింది. ఈ సంస్థకు ముంబయి, దిల్లీలలో బాట్లింగ్ ప్లాంట్లున్నాయి. ‘ద గ్రేట్ ఇండియన్ టేస్ట్’ నినాదంతో కాంపా కోలాను విక్రయించగా, అప్పట్లో వినియోగదార్ల నుంచి మంచి ఆదరణ లభించింది. 1990లో ప్రపంచీకరణకు భారత్ తలుపులు తెరవడం; కోక-కోలా, పెప్సీకో నుంచి పోటీ తీవ్రమై ప్యూర్ డ్రింక్స్ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంపా కోలా బ్రాండును సోస్యో హజూరి బేవరేజెస్‌కు విక్రయించింది. ఇటీవలే సోస్యోలో మెజార్టీ వాటాను రిలయన్స్ దక్కించుకోవడంతో.. కాంపా కోలా బ్రాండు కూడా ఆ సంస్థ సొంతమైంది. కాంపాతో ‘ద గ్రేట్ ఇండియన్ టేస్ట్’ను మళ్లీ తీసుకొచ్చినట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Anam: వైకాపా దుర్మార్గపు పాలనను అంతమొందించాలి: ఆనం రామనారాయణరెడ్డి
-
Sports News
Pat Cummins: అంతర్జాతీయ క్రికెట్ గుత్తాధిపత్యానికి ఐపీఎల్ ముగింపు పలికింది : ఆసీస్ కెప్టెన్
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
-
India News
Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ