ఇ-కామర్స్‌తో ఎంఎస్‌ఎంఈ సంస్థలకు ఎంతో మేలు

దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈ) సత్వర వృద్ధి సాధించడంలో ఇ-కామర్స్‌ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ క్షితిజ్‌ జైన్‌ వివరించారు.

Published : 25 Mar 2023 02:43 IST

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి దోహదం
‘ఈనాడు’తో అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ క్షితిజ్‌ జైన్‌

ఈనాడు - హైదరాబాద్‌: దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈ) సత్వర వృద్ధి సాధించడంలో ఇ-కామర్స్‌ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ క్షితిజ్‌ జైన్‌ వివరించారు. మనదేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కూడా ఈ భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. అంతేగాక ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగించుకుంటున్న ఎంఎస్‌ఎంఈ సంస్థలు తమ లాభాలను గణనీయంగా పెంచుకుంటున్నాయని స్పష్టం చేశారు. ‘ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌తో కలిసి ముందుకు సాగుతున్న దాదాపు 80 శాతం ఎంఎస్‌ఎంఈ సంస్థలు అధిక అమ్మకాలు, టర్నోవర్‌ నమోదు చేస్తున్నాయి. 70 శాతం సంస్థలు అధిక లాభాలూ ఆర్జిస్తున్నాయి’ అని ఆయన వివరించారు. రిటైల్‌ రంగంలో వస్తున్న మార్పులు, ఇ-కామర్స్‌ విభాగం క్రియాశీలత, సంబంధిత ఇతర అంశాలను  క్షితిజ్‌ జైన్‌  ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

‘లోకల్‌ షాప్స్‌’.. వినూత్నమైన కార్యక్రమం

ఇ-కామర్స్‌ విస్తరించటం వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు సైతం దేశం నలుమూలలా ఉన్న వినియోగదార్లకు   వస్తుసేవలు అందించే అవకాశం ఏర్పడుతోంది. ఎంఎస్‌ఎంఈ సంస్థల వృద్ధికి ఇ-కామర్స్‌ ఒక ప్రధాన వేదికగా మారుతోంది. ‘కొవిడ్‌’ మహమ్మారి కాలంలో స్థానికంగా ఉన్న వ్యాపారుల కోసం ‘లోకల్‌ షాప్స్‌ ఆన్‌ అమెజాన్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. దీనివల్ల వ్యాపారులకు తమ దగ్గరగా ఉన్న వినియోగదార్ల వివరాలు తెలిసే అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది. దేశవ్యాప్తంగా 450 ప్రదేశాల్లో 2.5 లక్షల మందికి పైగా చిన్న వ్యాపారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై లబ్ది పొందారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 16,000 మంది ‘లోకల్‌ షాప్స్‌’ వ్యాపారులు ఉన్నారు. ‘లోకల్‌ షాప్స్‌’ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లో ఇన్వర్టర్‌ బ్యాటరీలు అందించే ఒక చిన్న వ్యాపారి తన అమ్మకాలను రెట్టింపు చేసుకున్నారు.

ఎఫ్‌టీసీసీఐతో భాగస్వామ్యం

2022లో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ)తో ఒప్పందం కుదుర్చుకొని ఆన్‌లైన్‌ విక్రయాల్లో చిన్న, మధ్యతరహా వ్యాపారులకు అమెజాన్‌ శిక్షణ ఇచ్చింది. చిన్న చిన్న పట్టణాలకు చెందిన 500 మంది ఈ విధంగా శిక్షణ తీసుకొని లాభపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా విస్తరిస్తాం. అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌ను తెలుగు రాష్ట్రాల్లో 63,000 మంది వ్యాపారులు వినియోగించుకోగా.. ఇందులో హైదరాబాద్‌ నుంచే 21,000 మంది ఉన్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, విశాఖపట్టణం, గుంటూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని వ్యాపారులు ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అధిక విక్రయాలు నమోదు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని