స్టాక్‌ బ్రోకర్ల మోసాల నియంత్రణకు నిబంధనలు

కార్పొరేట్‌ పాలనను మరింత మెరుగుపర్చేందుకు, సెక్యూరిటీ మార్కెట్ల బలోపేతానికి సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వెల్లడి నిబంధనలను కఠినం చేసింది.

Published : 30 Mar 2023 01:53 IST

సెక్యూరిటీస్‌ మార్కెట్ల బలోపేతానికీ చర్యలు
మరింత మెరుగ్గా ‘కార్పొరేట్‌ పాలన’
వెల్లడి నిబంధనలు కఠినం
ఎంఎఫ్‌లకు ప్రాయోజిత సంస్థలుగా పీఈ ఫండ్‌లకు అనుమతి
సెబీ బోర్డు సమావేశ నిర్ణయాలు

దిల్లీ: కార్పొరేట్‌ పాలనను మరింత మెరుగుపర్చేందుకు, సెక్యూరిటీ మార్కెట్ల బలోపేతానికి సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వెల్లడి నిబంధనలను కఠినం చేసింది. నమోదిత కంపెనీల బోర్డులో శాశ్వత డైరెక్టర్లుగా కొనసాగే పద్ధతికీ చరమగీతం పాడింది. స్టాక్‌ బ్రోకర్ల మోసాల నియంత్రణకు నిబంధనలు తీసుకొచ్చింది. బుధవారం జరిగిన సెబీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో పై ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇవేకాకుండా మ్యూచువల్‌ ఫండ్‌లకు స్పాన్సర్లుగా (ప్రాయోజిత సంస్థలుగా) వ్యవహరించేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) ఫండ్‌లకు సెబీ అనుమతినిచ్చింది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) తరహాలో సెకండరీ మార్కెట్‌ లావాదేవీలకు కూడా ఫండ్‌- బ్లాకింగ్‌ వ్యవస్థ(అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌/అస్బా)ను సెబీ తీసుకురానుంది. మదుపర్ల డబ్బులను స్టాక్‌ బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా నియంత్రించేందుకు ఈ చర్య ఉపయోగపడనుంది. బ్లాక్‌ చేసిన నిధులను మార్జిన్‌, సెటిల్‌మెంట్‌ అవసరాలకు వాడేందుకు అనుమతినివ్వడం వల్ల.. ట్రేడింగ్‌ సభ్యులకు నిర్వహణ మూలధన అవసరాలు కూడా తగ్గుతాయి. అలాగే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌(ఏఐఎఫ్‌)లకు కఠిన నియంత్రణ నిబంధనలను అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. సెబీ ఆమోదం తెలిపిన మరికొన్ని ప్రతిపాదనల వివరాలు ఇలా..

* నమోదిత సంస్థలకు వెల్లడి నిబంధనలను మరింత కఠినం చేసే ఉద్దేశంలో భాగంగా.. బోర్డు సమావేశంలో డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు నిర్దేశిత సమయాన్ని (30 నిమిషాలు) సూచించింది. వాటాదారులకు ప్రత్యేక హక్కుల జారీ విషయంలో ఎప్పటికప్పుడు వాటాదార్ల అనుమతిని తీసుకోవాలని తెలిపింది. బోర్డులో డైరెక్టరుగా కొనసాగించేందుకు కూడా వాటాదార్ల అనుమతి అవసరమని పేర్కొంది.

* డైరెక్టర్లు, కాంప్లియన్స్‌ అధికారి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ), ముఖ్య ఆర్థిక అధికారి(సీఎఫ్‌ఓ) స్థానాలు ఖాళీ అయితే.. మూడు నెలల్లోగా కొత్త వారిని నియమించాలని సూచించింది. ఇలాంటి కీలక స్థానాలను ఖాళీగా ఉంచకుండా చూసుకోవాలని తెలిపింది.

* షరతులకు లోబడి ‘స్వీయ ప్రాయోజిత అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ’లు మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాన్ని కొనసాగించేందుకు అనుమతినివ్వాలని కూడా సెబీ నిర్ణయించింది.

* రూ.33,000 కోట్ల మూలనిధితో ఏఐఎఫ్‌ తరహాలో కార్పొరేట్‌ డెట్‌ మార్కెట్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(సీడీఎండీఎఫ్‌)ను ఏర్పాటు చేయనుంది. ఇందులో తొలుత రూ.3,000 కోట్లను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందిస్తాయని తెలిపింది. సంక్షోభ సమయంలో ఇన్వెస్ట్‌మెంట్‌- గ్రేడ్‌ కార్పొరేట్‌ డెట్‌ సెక్యూరిటీస్‌లను కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడనుంది.

* యూనిట్‌హోల్డర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మ్యూచువల్‌ ఫండ్‌ ట్రస్టీల బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధానానికీ సెబీ ఆమోదముద్ర వేసింది.

* ఈఎస్‌జీ(పర్యావరణం, సామాజిక, పాలన) వివరాల వెల్లడికి నమోదిత కంపెనీలకు కొత్త విధానాన్ని తీసుకొని రానున్నట్లు సెబీ తెలిపింది. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈఎస్‌జీ రేటింగ్‌ ప్రొవైడర్ల(ఈఆర్‌పీలు) పాత్ర పెరిగినందున.. వీటికి నిబంధనలను తేవాలని నిర్ణయించింది.

* స్టాక్‌ బ్రోకర్ల మోసాలను గుర్తించేందుకు, నియంత్రించేందుకు స్టాక్‌ బ్రోకర్లకు సంబంధించిన నిబంధనలకు సవరణలు చేయనుంది. విజిల్‌- బ్లోయర్‌ (ప్రజా వేగు) విధానం, ట్రేడింగ్‌ కార్యకలాపాలపై నిఘా, అంతర్గత నియంత్రణ వ్యవస్థ లాంటివి ఈ సవరణల్లో ఉండనున్నాయి. స్టాక్‌ బ్రోకర్ల మోసాల నియంత్రణకు సంబంధించి ఆమోదించిన సవరణలు 2023 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

* విదేశాల్లో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టే మదుపర్లకు నికర అసెట్‌ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) వెల్లడికి కొత్త కాల పరిమితి (టైం లిమిట్‌) నిబంధనలను సెబీ ప్రవేశపెట్టింది. దేశాల మధ్య సమయం వ్యత్యాసాలు, మార్కెట్‌ సమయాల్లో తేడాలుండడం వల్ల ఎన్‌ఏవీని లెక్కించడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కొత్త కాలపరిమితి నిబంధనలు 2023 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని సెబీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని