ఎయిరిండియా భారీ నియామకాలు
దేశంలో విమానయాన రంగ వృద్ధిపై భరోసాకు తగ్గట్లుగా, ఎయిరిండియాను తీర్చిదిద్దేందుకు నిర్దేశించుకున్న అయిదేళ్ల ప్రణాళిక (విహాన్.ఏఐ)ను అనుకున్నట్లే అమలు చేస్తున్నట్లు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు.
ప్రతినెలా 50 మంది పైలట్లు, 550 మంది క్యాబిన్ సిబ్బంది
ఇప్పటికే 4 విమానయాన సంస్థల్లో 20,000 మంది
సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్
దిల్లీ: దేశంలో విమానయాన రంగ వృద్ధిపై భరోసాకు తగ్గట్లుగా, ఎయిరిండియాను తీర్చిదిద్దేందుకు నిర్దేశించుకున్న అయిదేళ్ల ప్రణాళిక (విహాన్.ఏఐ)ను అనుకున్నట్లే అమలు చేస్తున్నట్లు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. కార్యకలాపాల విస్తరణ కోసం ప్రతినెలా 550 మంది క్రూ సిబ్బంది, 50 మంది పైలట్లను నియమించుకుంటున్నట్లు తెలిపారు. డిసెంబరు ఆఖరులోపు పెద్దవైన ఏ350 విమానాలు 6 తమకు చేరతాయని భావిస్తున్నట్లు వివరించారు. భారీ నష్టాల్లో కూరుకున్న ఎయిరిండియాను గతేడాది జనవరిలో ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్నాక, సంస్థ పునర్నిర్మాణానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తు చేశారు. దేశీయ, విదేశీ మార్గాల్లో సర్వీసులు విస్తరించేందుకే 470 విమానాలకు ఆర్డరు పెట్టినట్లు తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికలు ఆయన మాటల్లోనే..
ఈ ఏడాది అంతా నియామకాలే
ఎంతమంది సిబ్బందిని నియమించుకోవాలనేందుకు లక్ష్యమేదీ పెట్టుకోలేదు. అయితే ప్రతినెలా కొత్తగా చేరుతున్న 550 మంది క్రూ సిబ్బంది, 50 మంది పైలట్లకు శిక్షణ కొనసాగుతోంది. మా ఆధీనంలోకి రాకముందు కంటే క్యాబిన్ సిబ్బంది సంఖ్య పదింతలు, పైలట్ల సంఖ్య 5 రెట్ల మేర వార్షికంగా అధికమవుతోంది. ఈ ఏడాది మొత్తం నియామకాలు కొనసాగిస్తాం. కొత్త విమానాల సంఖ్య పెరిగే కొద్దీ సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతం అవుతుంది. అంటే 2024 ఆఖరుకు మరింత వేగంగా నియామకాలు జరుపుతాం.
నియంత్రణ సంస్థల అనుమతి మేరకే విలీనం
తమ గ్రూప్‌లోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరేషియా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్), విస్తారా-ఎయిరిండియా విలీన ప్రక్రియ నియంత్రణ సంస్థల అనుమతి మేరకే జరుగుతుంది. కార్యకలాపాల ఏకీకరణ జరిగే సమయంలో, ఆయా సంస్థల్లో ఉన్న సిబ్బందిని ఎలా సమర్థంగా వినియోగించుకోవాలో చూస్తాం. కొత్తగా నియామకాలు అవసరమైతే తీసుకుంటాం.
4 సంస్థల్లో 20,000 మంది సిబ్బంది
టాటా గ్రూప్ ఆధీనంలోని 4 సంస్థల్లో కలిపి మొత్తం 20,000 మంది సిబ్బంది ఉన్నారు. కొత్తగా నియమిస్తున్న వారు దీనికి అదనం. ఇప్పటికే ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ల కోసం కొత్తగా 500 మంది పైలట్లు, 2400 మంది క్యాబిన్ క్రూను నియమించుకున్నాం.
జులై-ఆగస్టు నుంచి కొత్త విమానాలొస్తాయ్
ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 122 విమానాలున్నాయి. ఈ ఏడాదే ఆర్డరు ఇచ్చిన 470 (ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220) విమానాల్లో మధ్యస్థాయి (నారోబాడీ) మోడళ్లు ఈ ఏడాది జులై-ఆగస్టు నుంచి జతచేరడం ఆరంభమవుతుంది. అక్టోబరు నుంచి పెద్ద విమానాలు (ఏ350) వస్తాయి. ఈలోపే బీ777 విమానాలు తొమ్మిదింటిని లీజుపై తీసుకున్నాం.
వచ్చే ఏడాది నుంచి సమూల మార్పులు
ఎయిరిండియా నిర్వహణలో వచ్చే ఏడాది నుంచి సమూల మార్పులొస్తాయి. ఎందుకంటే..లీజుకు తీసుకున్న విమానాలన్నీ అప్పటికి చేరతాయి. పాత విమానాల ఆధునికీకరణ కూడా పూర్తవుతుంది. కొత్తగా కొంటున్న విమానాల సరఫరా కూడా వేగవంతమవుతుంది.
సవాళ్లున్నాయ్
ఎయిరిండియా గత కొన్నేళ్లుగా పెట్టుబడులు అతి తక్కువగా పెట్టింది. ఇందువల్ల ఏర్పడిన పరిణామాల ప్రభావం ఇప్పుడు బయటపడుతోంది. ప్రయాణికుల అవసరాలు-ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడు నిర్వహణలో శరవేగంగా మార్పులు చేయాల్సి వస్తోంది. సంస్థల విలీనం కూడా జరగాల్సి ఉంది. సిబ్బంది నైపుణ్యాల పెంపునకు అవసరమైన శిక్షణ సామర్థ్యాలు సమకూర్చుకోవాలి.
దేశీయ విమానయానం బాగుంటుంది
దేశంలో విమానయాన రంగం ఆరోగ్యకర వృద్ధితో సాగాలని కోరుకుంటున్నాం. ఏదో ఒక విమానయాన సంస్థ విఫలమవుతుండటం అంత మంచిది కాదు. అత్యవసరాల కోసమే సిబ్బంది-నిర్వహణతో సహా ఇచ్చే విమానాలను (వెట్ లీజ్) దేశీయ సంస్థలు అద్దెకు తీసుకుంటున్నాయి. ఇది స్వల్పకాలమే ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు