అదానీ గ్రూప్‌ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.2 లక్షల కోట్లు (దాదాపు 14 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమొడిటీస్‌, సిమెంట్‌, మీడియా సహా పలు గ్రూప్‌ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది.

Published : 18 Mar 2024 01:25 IST

2024-25 ప్రణాళికలు

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.2 లక్షల కోట్లు (దాదాపు 14 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమొడిటీస్‌, సిమెంట్‌, మీడియా సహా పలు గ్రూప్‌ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే 7-10 ఏళ్లలో 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనలను అదానీ గ్రూప్‌ ఇంతకు ముందు వెల్లడించింది. ఇందులో ఎక్కువ భాగం పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్‌, విమానాశ్రయ వ్యాపారాల్లో పెట్టనుంది. మూలధన వ్యయాల ప్రణాళికల ప్రకారం..70% పెట్టుబడులు పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఎవాక్యూయేషన్‌ల్లో.. మిగతా 30% నిధులను విమానాశ్రయాలు, పోర్ట్‌ వ్యాపారాలకు వెచ్చించనున్నారు.

2023-24లో గ్రూప్‌ మూలధన వ్యయాలతో పోలిస్తే 2024-25 పెట్టుబడుల అంచనాలు 40% అధికమని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు దాదాపు 10 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.83,000 కోట్లు)గా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2023లో ఇలా: 2023లో గ్రూప్‌ కంపెనీలు 9.5 బిలియన్‌ డాలర్ల ఎబిటా (2022తో పోలిస్తే 34.4% ఎక్కువ) నమోదు చేశాయి. 2023 మార్చి నుంచి సెప్టెంబరు మధ్య నికర రుణాలు 4% తగ్గాయి. డిసెంబరు త్రైమాసికంలో అదానీ కంపెనీల ఎబిటా రికార్డు స్థాయిలో 63.6% పెరిగింది. దీంతో 2023లో ఎబిటా జీవనకాల గరిష్ఠమైన 9.5 బి.డాలర్లు(దాదాపు రూ.78,823 కోట్లు)గా నమోదైంది. నగదు నిల్వలు, లాభాలు పెరగడంతో గ్రూప్‌ భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. సెప్టెంబరుకు ఎబిటాతో పోలిస్తే నికర రుణాలు 2.5 రెట్లుగా ఉండగా, 2023-24 చివరకు ఇది మరింత తగ్గనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని