సముద్రం చూడ్డానికి అడ్డురావొచ్చని.. భవంతినే కొన్న రేఖా ఝున్‌ఝున్‌వాలా

తమ ఇంటి నుంచి సముద్రం చూసే అనుభూతి దూరం అవుతుందేమోననే అనుమానంతో.. ఏకంగా తమ ఇంటి పక్కనున్న ఒక భవంతిలోని దాదాపుగా ఫ్లాట్లన్నంటినీ కొనుగోలు చేశారట రేఖా ఝున్‌ఝున్‌ వాలా.

Published : 24 Mar 2024 05:09 IST

రూ.118 కోట్లతో 9 ఫ్లాట్లు సొంతం

ముంబయి: తమ ఇంటి నుంచి సముద్రం చూసే అనుభూతి దూరం అవుతుందేమోననే అనుమానంతో.. ఏకంగా తమ ఇంటి పక్కనున్న ఒక భవంతిలోని దాదాపుగా ఫ్లాట్లన్నంటినీ కొనుగోలు చేశారట రేఖా ఝున్‌ఝున్‌ వాలా. పెట్టుబడుల మాంత్రికుడిగా పేరున్న దివంగత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు భార్య ఈమె. మలబార్‌హిల్స్‌ వద్ద ఉన్న రేఖాకు చెందిన రేర్‌ విల్లా రెసిడెన్స్‌.. సముద్రానికి అభిముఖంగా ఉన్న రాక్‌సైడ్‌ అపార్ట్‌మెంట్స్‌కు వెనకాల ఉంది. అయితే దక్షిణ ముంబయిలోని వాకేశ్వర్‌ రోడ్‌లో ఉన్న ఈ 50 ఏళ్లు పైబడిన రాక్‌సైడ్‌ అపార్ట్‌మెంట్స్‌ సహా మరో ఆరు భవనాలను క్లస్టర్‌ పథకం కింద పునర్‌నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం షాపూర్జీ పల్లోంజి సంస్థ ఓ ప్రతిపాదనను కూడా సమర్పించింది. అయితే ఈ భవనాల పునర్నిర్మాణం వల్ల రేర్‌ విల్లా నుంచి అరేబియా సముద్ర వీక్షణ అనుభూతి దూరం కావొచ్చని ఊహించి.. ఆ పాత భవంతిలోని ఫ్లాట్లను ఒక్కొక్కటిగా రేఖా కొనుగోలు చేస్తూ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలా 2023 నవంబరు నుంచి వివిధ సంస్థల ద్వారా తొమ్మిది ఫ్లాట్లను రూ.118 కోట్లకు కొనుగోలు చేశారని రిజిస్ట్రేషన్‌ దస్త్రాల ఆధారంగా తెలుస్తున్నట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ తన కథనంలో వెల్లడించింది. అయితే ఆ భవంతిలో 24 ఫ్లాట్లు ఉండగా.. ఇప్పటికే 19 వరకు రేఖా ఝున్‌ఝున్‌వాలా కుటుంబీకుల చేతిలోనే ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాక్‌సైడ్‌ సీహెచ్‌ఎస్‌ భవంతిపై నిర్ణయం తీసుకోవాలంటే అధిక ఫ్లాట్లు కలిగి ఉన్న కొత్త యజమాని నుంచి స్పష్టత కోసం ఎదురుచూడాల్సి ఉండటంతో క్లస్టర్‌ పునర్నిర్మాణ ప్రక్రియను షాపూర్జీ పల్లోంజీ ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా బ్రోకర్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని