Honda Elevate: క్రెటా, గ్రాండ్‌ విటారాకు పోటీ హోండా ఎలివేట్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

Honda Elevate price: హోండా ఎలివేట్‌ పేరిట కొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.11 లక్షలుగా నిర్ణయించింది.

Published : 04 Sep 2023 16:14 IST

Honda Elevate launched: ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ హోండా మోటార్స్‌ అనుబంధ హోండా కార్స్‌ ఇండియా.. మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎలివేట్‌ (Honda Elevate) పేరిట కొత్త కారును భారత మార్కెట్లోకి సోమవారం (సెప్టెంబర్‌ 4) విడుదల చేసింది. లాంచ్‌ చేసింది. దీని ధర రూ.10.99 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ దిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్‌ విటారా, కియా సెల్టోస్‌, టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైర్డర్‌ వంటి కార్లకు ఎలివేట్‌ పోటీ ఇవ్వనుంది.

హోండా ఎలివేట్‌ (Honda Elevate)లో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌, సెవెన్‌ స్పీడ్‌ కంటిన్యూస్లీ వేరియబుల్‌ ట్రాన్స్‌మిషన్‌ (సీవీటీ) వేరియంట్లో లభిస్తోంది. మాన్యువల్‌ వేరియంట్స్‌ ధరలు రూ.10.99 లక్షల నుంచి రూ.14.9 లక్షల మధ్య ఉండగా.. ఆటోమేటిక్‌ వేరియంట్ల ధరలు రూ.13.2 లక్షల నుంచి రూ.15.99 లక్షల మధ్య ఉన్నాయి. మాన్యువల్‌ వేరియంట్‌ మైలేజీ లీటర్‌కు 15.31 కిలోమీటర్లు కాగా.. సీవీటీ వేరియంట్‌ మైలేజీ 16.92 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. ఇందులో 458 లీటర్ల కార్గో స్పేస్‌ లభిస్తుంది. ఏడు సింగిల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్లు, మూడు డ్యయూల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్స్‌తో ఎలివేట్‌ లభిస్తుంది.

తక్కువ ధరకే విమాన టికెట్‌ పొందేలా.. గూగుల్‌లో కొత్త ఫీచర్లు!

ఇక హోండా ఎలివేట్‌ (Honda Elevate) ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 17 అంగుళాల డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఇస్తున్నారు. మల్టీ ఫంక్షనల్‌ స్టీరింగ్‌ వీల్‌, డ్యూయల్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటివి ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఇచ్చారు. వైర్‌లెస్‌ కార్‌ కనెక్ట్‌ టెక్నాలజీకి సపోర్ట్‌ చేసే 8 స్పీకర్స్‌ అమర్చారు. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్‌ వార్నింగ్‌, పార్కింగ్‌ సెన్సర్‌, లేన్‌ కీప్‌ అసిస్టెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంటెన్స్‌ సిస్టమ్‌ (ADAS) వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడేళ్ల అన్‌లిమిటెడ్‌ కిలోమీటర్ వారెంటీతో పాటు 5 ఏళ్ల ఎక్సెడెంటెండ్‌ వారెంటీ, 10 ఏళ్ల పాటు రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ సదుపాయం వంటివి ఆఫర్‌ చేస్తున్నారు. డెలివరీలు ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

2030కల్లా ఐదు రకాల కొత్త ఎస్‌వీయూలు

దేశీయంగా 2030 నాటికి ఐదు కొత్త మోడళ్ల ఎస్‌యూవీలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంపై తాము దృష్టి సారించామని, ఎలివేట్‌తో దాన్ని ప్రారంభించామని హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ త్సుముర పేర్కొన్నారు. ప్రస్తుతం సిటీ, అమేజ్‌ పేరుతో హోండా కంపెనీ సెడాన్స్‌ విక్రయిస్తోంది. జులైలో ఎలివేట్‌కు బుకింగ్స్‌ ప్రారంభించామని, కొన్ని వేరియంట్లకు ఐదారు నెలల వెయింటింగ్‌ పీరియడ్‌ ఉందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మొత్తం ప్రయాణికుల వాహనాల్లో ఎస్‌యూవీల వాటా 48 శాతంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని