Google Flights: తక్కువ ధరకే విమాన టికెట్‌ పొందేలా.. గూగుల్‌లో కొత్త ఫీచర్లు!

Google Flights: విమాన ప్రయాణికుల కోసం వివిధ రకాల సమాచారాన్ని గూగుల్‌ ఫ్లైట్స్‌ అందిస్తోంది. తాజాగా మరికొన్ని ఫీచర్లను జత చేసి తక్కువ ధరలో టికెట్లను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

Updated : 30 Aug 2023 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమాన టికెట్లపై డబ్బు ఆదా చేయాలనుకునే వారి కోసం గూగుల్‌ (Google) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా విమాన టికెట్ల ధరలు తరచూ మారుతూ ఉంటాయి. ఏ సందర్భంలో ధర తగ్గుతుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి బుక్‌ చేసుకున్న తర్వాత కూడా ధర దిగిరావచ్చు. అలాంటి సమస్యను అధిగమించడం కోసమే గూగుల్‌ ఫ్లైట్స్‌ (Google Flights) కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం..

ఎప్పుడు బుక్‌ చేసుకోవాలి?

ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధర గతంతో పోలిస్తే తక్కువేనా? లేదా? పోల్చుకునే ఆప్షన్‌ గూగుల్‌ ఫ్లైట్స్‌ (Google Flights)లో ఇప్పటికే ఉంది. కానీ, ఇప్పుడు బుక్‌ చేసుకోవాలా? ఇంకేమైనా తగ్గుతుందేమో చూద్దామా? అనే సందేహం మాత్రం ఇంకా ఉంటుంది. కొత్త ఫీచర్ల సాయంతో గత చరిత్రను బట్టి ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉందో గూగుల్‌ చెప్పనుంది. ఉదాహరణకు.. ‘‘విమానం బయలుదేరే తేదీకి రెండు నెలల ముందు ధరలు బాగా తక్కువగా ఉంటాయి. లేదా టేకాఫ్‌ గడువు సమీపిస్తున్న కొద్దీ ధరలు దిగొస్తున్నాయి’’.. ఇలా గత ట్రెండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. తద్వారా ప్రయాణికులు టికెట్‌ ఎప్పుడు బుక్‌ చేసుకోవాలో ఓ అంచనాకు రావొచ్చని గూగుల్‌ తమ బ్లాగ్‌లో తెలిపింది.

తక్కువ ధర కోసం..

‘ప్రైస్‌ ట్రాకింగ్‌’ అనే కొత్త ఫీచర్‌నూ గూగుల్‌ ప్రవేశపెట్టబోతోంది. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే.. ఎప్పుడు ధరలు దిగొచ్చినా వెంటనే నోటిఫికేషన్‌ వస్తుంది. కావాలంటే మీ ప్రయాణానికి కొన్ని నెలల ముందు ఎప్పుడు ధరలు దిగొస్తే అప్పుడు నోటిఫికేషన్‌ వచ్చేలా ప్రత్యేకంగా తేదీలను కూడా సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. అయితే, దీనికోసం కచ్చితంగా గూగుల్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయి ఉండాలి.

ప్రైస్ గ్యారంటీ..

కొన్ని విమానాల ప్రయాణాలపై గూగుల్‌ ఓ రంగుతో కూడిన బ్యాడ్జ్‌ని ఉంచుతుంది. అంటే గత ట్రెండ్‌ను బట్టి టికెట్‌ ధర ఇంతకంటే తగ్గే అవకాశం లేదని దాని అర్థం. ఒకవేళ అది ఇంకా తగ్గితే గనక మీరు చెల్లించిన అధిక మొత్తాన్ని ‘గూగుల్‌ పే’ ద్వారా మీ ఖాతాలో జమ చేస్తుంది. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో మాత్రమే అమలు చేస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది.

  • వీటితో పాటు 2023 ప్రయాణాలకు సంబంధించిన ట్రెండ్స్‌ను గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకుంది. సాధారణంగా డిసెంబర్‌ మధ్యలో ప్రారంభమయ్యే క్రిస్మస్‌ సెలవుల కోసం అక్టోబర్‌ నుంచే టికెట్ల బుకింగ్‌ ప్రారంభమవుతుంది. గత ట్రెండ్స్‌ ప్రకారం.. విమానం బయలుదేరే తేదీకి 22 రోజుల ముందు టికెట్ల సగటు ధరలు తక్కువగా ఉంటున్నాయని తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు