Credit Score: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? అయితే, ఇలా పెంచుకోండి!

Credit Score: ఒక వ్యక్తి ఆర్థికారోగ్యం ఎలా ఉందో క్రెడిట్‌ స్కోరు చెప్పేస్తుంది. 300-900 మధ్య ఉండే ఈ స్కోరు రుణం తీసుకోబోయే వ్యక్తి ఎంత క్రమశిక్షణతో ఉన్నారన్నది తెలియజేస్తుంది. దీన్ని గణించడంలో క్రెడిట్‌ బ్యూరోలు ఎన్నో అంశాలను పరిగణనలోనికి తీసుకుంటాయి. ఎప్పటి నుంచి రుణం తీసుకుంటున్నారు,

Updated : 01 Aug 2022 09:41 IST


ఒక వ్యక్తి ఆర్థికారోగ్యం ఎలా ఉందో క్రెడిట్‌ స్కోరు చెప్పేస్తుంది. 300-900 మధ్య ఉండే ఈ స్కోరు రుణం తీసుకోబోయే వ్యక్తి ఎంత క్రమశిక్షణతో ఉన్నారన్నది తెలియజేస్తుంది. దీన్ని గణించడంలో క్రెడిట్‌ బ్యూరోలు ఎన్నో అంశాలను పరిగణనలోనికి తీసుకుంటాయి. ఎప్పటి నుంచి రుణం తీసుకుంటున్నారు, చెల్లింపుల చరిత్ర, రుణాల గురించి చేసిన సంప్రదింపులు తదితరాలన్నీ దీన్ని ప్రభావితం చేస్తాయి. మంచి క్రెడిట్‌ స్కోరున్న వారికి రుణాలు సులభంగా లభిస్తాయి. కాబట్టి, మీ స్కోరు తక్కువగా ఉంటే.. దీన్ని పెంచుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

రుణ వాయిదాలు సకాలంలో చెల్లించడం ఎప్పుడూ మంచిదే. క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసే అంశాల్లో ఇదే ప్రధానం. ఒక్కసారి గడువు మీరినా.. స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే, చెల్లింపులు సకాలంలో ఉండేలా చూసుకోవాలి. వ్యక్తి ఆర్థిక సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది.
* క్రెడిట్‌ కార్డుల పరిమితిని పూర్తిగా వినియోగించుకోవద్దు. ఒకటి రెండుసార్లు ఇబ్బందేమీ ఉండదు. కానీ, పలుమార్లు ఇలా జరిగితే.. అప్పుల కోసం ఎదురుచూస్తున్నట్లు బ్యాంకులు భావిస్తాయి. దీంతో క్రెడిట్‌ స్కోరూ కాస్త తగ్గుతుంది.
* హామీలేని రుణాలను ఎక్కువగా తీసుకోవద్దు. వీటితోపాటు, హామీ ఉండే అప్పులూ ఉండాలి. ఇవి రెండూ సమతౌల్యంగా ఉన్నప్పుడే క్రెడిట్‌ స్కోరు అధికమవుతుంది.
* క్రెడిట్‌ నివేదికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. దీనివల్ల ఏదైనా వాయిదాలు మర్చిపోయినా.. లేదా మీకు సంబంధం లేని రుణాలు, క్రెడిట్‌ కార్డులు మీ పేరుపైన ఉన్నాయా అన్న సంగతి తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు మన ధ్రువీకరణలను మోసపూరిత వ్యక్తులు వాడి, అప్పులు, క్రెడిట్‌ కార్డులు తీసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. క్రమం తప్పకుండా నివేదికను గమనించినప్పుడే ఇలాంటి విషయాలు బయటపడతాయి.

అపోహలు వీడాలి..

ఒకప్పుడు క్రెడిట్‌ స్కోరు బ్యాంకులు, రుణ సంస్థలు మాత్రమే పరిశీలిస్తాయనే అపోహతో చాలామంది ఉంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీమా సంస్థలు, పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ నెంబరు తీసుకోవాలనుకున్నప్పుడు టెలికాం కంపెనీలూ మీ స్కోరును పరిశీలిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను తీసుకునేటప్పుడూ క్రెడిట్‌ నివేదికలను పరిశీలిస్తున్నాయి.
* క్రెడిట్‌ నివేదికలను తరచూ తనిఖీ చేసుకోవడం వల్ల స్కోరు తగ్గుతుందనేది అపోహ. వాస్తవం ఏమిటంటే.. క్రెడిట్‌ స్కోరును తెలుసుకోవడాన్ని బ్యాంకులు రుణం కోసం అభ్యర్థనగా పరిగణించవు. కాబట్టి, క్రెడిట్‌ స్కోరుపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి క్రెడిట్‌ బ్యూరో ఏడాదికోసారి వినియోగదారులకు ఒకసారి ఉచితంగా నివేదికను అందిస్తాయి.
* ఆదాయం అధికంగా ఉంటే.. స్కోరు పెరుగుతుందనీ చాలామంది అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. నివేదికలో ఎక్కడా మీ ఆదాయాన్ని ప్రస్తావించరు. కేవలం మీరు తీసుకున్న అప్పులు, వాటిని చెల్లిస్తున్న తీరే క్రెడిట్‌ స్కోరుకు ప్రాతిపదిక అనేది గుర్తుంచుకోండి.

- సుభ్రాంగ్షు ఛటోపాధ్యాయ్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, క్రిఫ్‌ హై మార్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని