Published : 27 Jul 2022 15:11 IST

ITR Filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ఇంకా 4 రోజులే.. గడువు పొడిగిస్తారా?

ITR Filing: ప్రత్యేక ఆడిట్‌ అవసరంలేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2022 జులై 31 ఆఖరు తేదీ. అంటే ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉంది. గత మూడేళ్లలో ఐటీ విభాగం ఏదో ఒక కారణంతో గడువు పొడిగిస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే జరుగుతుందేమోనని చాలా మంది ఆశిస్తున్నట్లు రిటర్నుల దాఖలు తీరును చూస్తే తెలుస్తోందని ఐటీ విభాగం అధికారులు అభిప్రాయపడ్డారు.

కానీ, గడువు పొడిగింపునకు ప్రభుత్వం ఈసారి ఏమాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. ఇటీవల సీఏ, ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌కు సంబంధించిన పలు అసోసియేషన్‌లు కేంద్ర ఆర్థికశాఖ వద్దకు ఫైలింగ్‌ తేదీ పొడిగింపు ప్రతిపాదనను తీసుకెళ్లినా కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI)’ మాత్రం తాము గడువు పొడిగింపు విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని తెలిపింది. తమ సభ్యులెవరూ సర్కార్‌ వద్దకు ఈ ప్రతిపాదనతో వెళ్లొద్దని ఆదేశించింది.

సోషల్‌ మీడియాలో మాత్రం గడువు పొడిగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ‘‘Extend_Due_Date_Immediately’’ హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఫైలింగ్‌లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదాయపన్ను విభాగం మాత్రం జులై 31 నాటికి ఐటీఆర్‌ ఫైల్‌ చేయాల్సిందేనంటూ బుధవారం ట్విటర్‌ వేదికగా మరోసారి గుర్తుచేసింది.

జులై 26నాటికి 3.4 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు దాఖలైనట్లు ఐటీ విభాగం తెలిపింది. అందులో 26నే 30 లక్షల రిటర్నులు ఫైల్‌ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 2.71 కోట్ల రిటర్నులు వెరిఫై అయినట్లు.. ఇంకా 1.97 కోట్ల రిటర్నులను వెరిఫై చేయాల్సి ఉందని తెలిపింది.

* గడువు ఒక నెల పొడిగించడం వల్ల వచ్చే నష్టం ఏంటని ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గడువు పొడిగిస్తే సైట్‌పై లోడ్‌ తగ్గుతుందని తెలిపారు. అలాగే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని చెప్పుకొచ్చారు. ఫలితంగా ప్రభుత్వానికే ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.

* ఐటీ పోర్టల్‌లో సమస్యపై ఫిర్యాదు చేయడానికి తాను ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి ఫోన్‌ చేసినట్లు మరో ట్విటర్‌ యూజర్‌ తెలిపారు. అయితే అక్కడ ఉన్న అధికారి మాట్లాడుతూ.. ‘‘సమస్య ఎక్కడో చూద్దామంటే తన వద్ద ఉన్న పోర్టల్‌ కూడా గత 10 నిమిషాల నుంచి లోడ్‌ అవుతోంది’’ అని సమాధానం చెప్పినట్లు నెటిజన్‌ వెల్లడించారు.Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని