Jio 5G Services: మరో 50 నగరాల్లో జియో 5జీ సేవలు..

రిలయన్స్‌ జియో 5జీ సేవలను మరో 50 నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది. తాజాగా ఏపీలోని చిత్తూరు, ఒంగోలు, కడప నగరాల్లో ఈసేవలు అందుబాటులోకి వచ్చాయి.

Updated : 24 Jan 2023 18:18 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) తన 5జీ సేవల్ని శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 5జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కొత్తగా సేవలు ప్రారంభించిన నగరాల పరిధిలోని యూజర్లు జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 1జీబీపీఎస్‌ కంటే ఎక్కువ వేగంతో అపరిమిత డేటాను వాడుకోవచ్చని చెప్పింది. తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్లు టెలికం దిగ్గజం వెల్లడించింది.

‘‘ 17 రాష్ట్రాల పరిధిలో మరో 50 నగరాలకు 5జీ సేవల్ని విస్తరించడం ఎంతో సంతోషంగా ఉంది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక ఒకేసారి ఇన్ని నగరాలకు విస్తరించడం ఇదే తొలిసారి ’’ అని రిలయన్స్‌ జియో ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌, గోవా, హరియాణా, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ  తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, యూపీ, పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్రాల పరిధిలోని కొన్ని నగరాలతోపాటు  పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో తాజాగా 5జీ సేవలను ప్రారంభించినట్లు జియో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, ఒంగోలు, కడప, అస్సాంలోని నాగాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌, కోర్బా, గోవా రాజధాని పనాజీ, హరియాణాలోని అంబాలా,హిస్సార్‌, కర్నల్‌, పానిపత్‌, రోహ్‌తక్‌, కర్ణాటకలోని హసన్‌, మాండ్య నగరాల్లో కొత్తగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో 5జీ సేవల్ని విస్తరించగా.. ఇటీవల ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు నగరాల్లో ఈ సేవలను విస్తరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని