cyber attacks: వ్యక్తిగత డేటా పోగొట్టుకున్న విషయం వాళ్లకే తెలియదట!

cyber attacks: సైబర్ సెక్యూరిటీ సంస్థ రుబ్రిక్‌ ఆధ్వర్యంలో వేక్‌ఫీల్డ్ నిర్వహించిన సర్వేలో సైబర్‌ దాడులకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

Published : 12 Dec 2023 16:54 IST

cyber attacks | ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ కేటుగాళ్లు కొత్త పంథాలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. మనలో ప్రతి ముగ్గురిలో ఒకరు సైబర్‌ వలలో చిక్కుకొని వ్యక్తిగత సమాచారాన్ని పోగొట్టుకున్నారని ఓ సర్వే ద్వారా తెలిసింది. అంతేకాదు బాధితులకు ఆ విషయం కూడా తెలియదట! సైబర్ సెక్యూరిటీ సంస్థ రుబ్రిక్ ఆధ్వర్యంలో వేక్‌ఫీల్డ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఈ ఏడాది జూన్‌ 30 నుంచి జులై 11 మధ్య అమెరికా, బ్రిటన్‌, భారత్‌ సహా 10 దేశాల్లోని దాదాపు 1,600 కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించింది. కంపెనీలో ఐటీ, సెక్యూరిటీకి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇందులో ఉన్నారు. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గతేడాదిలో 53 శాతానికి పైగా కంపెనీలు తమ సంస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కోల్పోయాయని రుబ్రిక్‌ తన నివేదికలో తెలిపింది. ఇలా సమాచారాన్ని కోల్పోవటంతో ప్రతి ఆరు సంస్థల్లో ఒక కంపెనీ పెద్ద ఎత్తున నష్టాల్ని చవి చూశాయని పేర్కొంది. ఇక భారత్‌లో 47 శాతం మంది తాము పనిచేస్తున్న సంస్థ డేటాను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేయగా.. మరో 30 శాతం మంది వచ్చే 12 నెలల్లో తమ కంపెనీ సున్నితమైన డేటాను కోల్పోయే అవకాశం ఉందని తెలిపినట్లు వెల్లడయింది.

రిలయన్స్‌-డిస్నీ విలీనం ఇక లాంఛనం?

గడిచిన 18 నెలల్లో భద్రపరచాల్సిన డేటా 42 శాతం పెరిగిందని, ఒక సాధారణ సంస్థ భద్రపరచాల్సిన డేటా పరిమాణం వచ్చే ఏడాది నాటికి 100 BETB (బ్యాక్-ఎండ్ టెరాబైట్) పెరుగుతుందని, వచ్చే ఐదేళ్లలో ఈ పరిమాణం 7 రెట్లు పెరిగే అవకాశం ఉందని రుబ్రిక్‌ జీరో ల్యాబ్‌ అంచనా వేసింది. డేటాను భద్రపరచటంలో కొన్ని సంస్థలు తమ అసమర్థతను అంగీకరించడం లేదంటూ రుబ్రిక్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు విపుల్ సిన్హా ఆందోళన వ్యక్తంచేశారు. ‘సైబర్‌ దాడులను పూర్తిగా ఆపలేరు. దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని ముందే ఊహించి ఆయా సంస్థలు సంసిద్ధంగా ఉండాలి’’ అని సిన్హా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని