Meta: మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న మెటా!

మెటా (Meta) మరోసారి లేఆఫ్‌లు విధించేందుకు సిద్ధమైంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. అలానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం ఇప్పట్లో భర్తీ చేయబోమని ప్రకటించింది.

Updated : 14 Mar 2023 20:19 IST

కాలిఫోర్నియా: ఫేస్‌బుక్‌(Facebook) మాతృసంస్థ మెటా(Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. నాలుగు నెలల క్రితం 11 వేల మంది తొలగించింది. తాజాగా మరో 10 వేల మంది ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌(Mark Zuckerberg) సంస్థ ఉద్యోగులకు ప్రత్యేకంగా లేఖ రాశారు. ‘‘మన బృందంలో పది వేల మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. అలానే ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఐదు వేల ఉద్యోగాలను సైతం భర్తీ చేయబోం’’ అని జుకర్‌బర్క్‌ లేఖలో పేర్కొన్నారు.  

2023ను సమర్థవంతమైన ఏడాది (Year of Efficiency)గా జుకర్‌బర్గ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కంపెనీ ఆర్థిక వ్యయాన్ని ఐదు బిలియన్లు తగ్గించాలని నిర్ణయించారు. దీంతో ఈ వ్యయం 95 బిలియన్ల నుంచి 89 బిలియన్లను తగ్గనుంది. అలానే ప్రాధాన్యంలేని ప్రాజెక్ట్‌లను కూడా తగ్గించుకోవాలని మెటా నిర్ణయించింది. దీనివల్ల ఉద్యోగ నియామకాలు తగ్గి కంపెనీపై ఆర్థికపరమైన భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. ఈ నిర్ణయంతో మెటా షేర్ల విలువ రెండు శాతం మేర పెరిగాయి. 

ఆర్థిక మాంద్యం భయాలతో అమెరికాలో పెద్ద సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా వంటి టెక్ సంస్థలతోపాటు గోల్డ్‌మన్‌ శాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ వంటి ఆర్థిక రంగ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించాయి. 2022 అక్టోబరులో ట్విటర్‌తో ప్రారంభమైన ఈ లేఆఫ్‌ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు లేఆఫ్స్‌.ఫై (layoffs.fyi) అనే సంస్థ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని