Muthoot Microfin IPO: ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ఐపీఓ.. ధరల శ్రేణి, ఇతర వివరాలు ఇవే..

Muthoot Microfin IPO: ముత్తూట్‌ మైక్రోఫిన్‌ సంస్థ ధరల శ్రేణి ఖరారైంది. డిసెంబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 20 వరకు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది.

Published : 13 Dec 2023 20:29 IST

Muthoot Microfin IPO | ముంబయి: ముత్తూట్‌ పప్పాచాన్‌ గ్రూప్‌నకు చెందిన మైక్రో రుణ సంస్థ ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ఐపీఓ (Muthoot Microfin IPO) ధరల శ్రేణి ఖరారయ్యిది. డిసెంబర్‌ 18న ఐపీఓకు రానున్న ఈ సంస్థ ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.277-291గా నిర్ణయించింది. డిసెంబర్‌ 20న సబ్‌స్క్రిప్షన్‌ ముగుస్తుంది. మొత్తం రూ.960 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో రూ.760 కోట్లను ప్రైమరీ షేర్ల విక్రయం ద్వారా.. మిగిలిన రూ.200 కోట్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ముత్తూట్‌ మైక్రోఫిన్‌లో 19.06 శాతం వాటా కలిగిన ఇన్వెస్టర్‌ సంస్థ గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ రూ.50 కోట్లకు సమానమైన 2.06 శాతం వాటాను విక్రయించనుంది. ప్రమోటర్‌ కుటుంబం సైతం తమ వాటాను తగ్గించుకోనుంది. ఐపీఓలో విక్రయిస్తున్న షేర్లను క్యూఐబీలకు 55 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం చొప్పున కేటాయించారు. రిటైల్‌ మదుపరులు కనీసం 51 షేర్లకు (లాట్‌) బిడ్లు దాఖలు చేయాలి. అంటే కనీసం రూ.14,841 చొప్పున పెట్టుబడి పెట్టాలి.

వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. గ్రూప్‌లో ముఖ్యమైన టాపిక్స్ ఇక మిస్‌ కాలేరు

ముత్తూట్‌ పప్పాచాన్‌ గ్రూప్‌ బంగారం తాకట్టు రుణాలతో పాటు తమ అనుబంధ సంస్థల ద్వారా సాధారణ, రియల్‌ ఎస్టేట్‌, ఎడ్యుకేషన్‌ లోన్స్‌ను అందిస్తుంటుంది. ఈ గ్రూప్‌ నుంచి వస్తున్న రెండో ఐపీఓ ఇది. గతంలో ద్విచక్ర వాహన రుణాలు అందించే ముత్తూట్‌ క్యాపిటల్‌ సంస్థ ఐపీఓకు వచ్చింది. ముత్తూట్‌ మైక్రోఫిన్‌ సంస్థకు 32 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. తిరువనంతపురానికి చెందిన ఈ కంపెనీకి 18 రాష్ట్రాల్లో 1340 శాఖలు ఉన్నాయి. 12,290 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

ఐపీఓ వివరాలు

  • ఐపీఓ తేదీలు: డిసెంబర్‌ 18- 20
  • ముఖ విలువ: రూ.10
  • ధరల శ్రేణి: రూ.277- 291 
  • లాట్‌ సైజ్‌: 51 షేర్లు
  • షేర్ల అలాట్‌మెంట్‌ తేదీ: డిసెంబర్‌ 21
  • రిఫండ్లు: డిసెంబర్‌ 22
  • లిస్టింగ్‌ తేదీ: డిసెంబర్‌ 26
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని