చౌక ప్లాన్‌ కోసం మైక్రోసాఫ్ట్‌తో Netflix జట్టు.. వచ్చేది అప్పుడే!

కొత్త సినిమాలు, కొత్త కొత్త వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకునే నెట్‌ఫ్లిక్స్ (Netflix)‌.. వినియోగదారుల నాడి పట్టుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడింది.

Published : 15 Jul 2022 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సినిమాలు, కొత్త కొత్త వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకునే నెట్‌ఫ్లిక్స్ (Netflix)‌.. వినియోగదారుల నాడి పట్టుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడింది. దీంతో యూజర్ల సంఖ్యను పెంచుకోవడంలో విఫలమవుతోంది. ప్రసారాల మధ్యలో ప్రకటనలు వచ్చినా పర్వాలేదు.. ప్లాన్‌ మాత్రం తక్కువగా ఉంటే చాలనుకుంటున్నారు నేటి జనం. అందుకే నెట్‌ఫ్లిక్స్‌ సైతం రూటు మార్చింది. యాడ్స్‌తో కూడిన ఓ చౌక ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఇటీవలే ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మైక్రోసాఫ్ట్‌తో నెట్‌ఫ్లిక్స్‌ జట్టు కట్టింది.

యాడ్‌ సపోర్టింగ్‌ స్ట్రీమింగ్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ను తమ భాగస్వామిగా చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గ్రెగ్‌ పీటర్స్‌ తెలిపారు. ఇందుకోసం గూగుల్‌, క్రోమ్‌క్యాస్ట్‌తో జట్టు కట్టాలని నెట్‌ఫ్లిక్స్‌ తొలుత భావించినా.. మైక్రోసాఫ్ట్‌కంటూ నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా ప్రత్యేక వీడియో ప్లాట్‌ఫాం ఏదీ లేకపోవడంతో ఈ జోడీ ఖరారైంది. ఈ భాగస్వామ్యం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంపై మైక్రోసాఫ్ట్‌ యాడ్స్‌ను చూపించనుంది.

సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గుముఖం పట్టిన వేళ చౌక ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ యోచిస్తోందని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మే నెలలో ఆ కంపెనీ ధ్రువీకరించింది. ఎప్పటి నుంచి ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చేది నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించలేదు. అయితే, ఈ ఏడాది చివరికల్లా యాడ్స్‌తో కూడిన చౌక ప్లాన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాన్‌ను తీసుకొస్తుందా? లేదంటే కొన్ని దేశాలకే పరిమితం చేస్తుందా? అనేది కూడా స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని