Oil prices: ఎగబాకిన చమురు ధరలు..!

అంతర్జాతీయ పరిణామాలు చమురు ధరలను మరోసారి ఎగదోశాయి. రష్యా నుంచి ఎగుమతి అయ్యే చమురుపై జీ-7 దేశాలు విధించిన ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 

Updated : 05 Dec 2022 11:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా(Russia)  విక్రయించే చమురు(oil prices) పై జీ-7 దేశాలు విధించిన ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో చమురు ధరల్లో 1 శాతం మేరకు పెరుగుదల కనిపించింది. ఆసియా ట్రేడింగ్‌లో నేడు బ్రెంట్‌ క్రూడ్‌ పీపా ధర 86 డాలర్లకు పైగానే ట్రేడవుతోంది. ఒక దశలో ఇది 2.4శాతం వరకు కూడా పెరిగి.. ఆ తర్వాత తగ్గింది. ఇక వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ చమురు ఫ్యూచర్‌ 1.1శాతం ధర పెరిగింది. 

మరో వైపు ఒపెక్‌ దేశాలు మాత్రం చమురు ఉత్పత్తి పెంచేందుకు సానుకూలంగా లేవు. గతంలో నిర్ణయంచిన ప్రకారమే ఉత్పత్తి తగ్గించేందుకు కట్టుబడి ఉన్నట్లు  ప్రకటించాయి. దీంతో రోజుకు 20 లక్షల పీపాల చమురు ఉత్పత్తి కోత పడటం ఖాయమైంది. ఇది ప్రపంచ డిమాండ్‌లో 2శాతానికి సమానం. ఒపెక్‌ చమురు తగ్గింపు నిర్ణయంపై  అక్టోబర్‌లోనే అమెరికాలోని శ్వేతసౌధం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒపెక్‌ప్లస్‌ (opec plus) దేశాలు రష్యాతో కలిశాయని ఆరోపించింది.

మరోవైపు చైనాలో ఆందోళనల కారణంగా జీరో కోవిడ్‌ పాలసీలో మార్పులకు అక్కడి ప్రభుత్వం సానుకూలంగా ఉండటం చమురు మార్కెట్‌లో డిమాండ్‌కు కారణమైంది. రెండు రోజుల క్రితమే జీ-7దేశాలు(G-7 Countries) సమావేశమై రష్యా చమురుకు గరిష్ఠంగా 60డాలర్లు చెల్లించాలని నిర్ణయించాయి. కానీ, ఒపెక్‌ నిర్ణయం, చైనాలో మారుతున్న పరిస్థితులు జీ-7 దేశాల నిర్ణయం అమలుకు పెనుసవాలుగా మారనున్నాయి. ఉత్పత్తి తగ్గి.. డిమాండ్‌ పెరిగి.. రష్యా నుంచి చమురు ఎగుమతి నిలిచిపోతే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. జీ-7 నిర్ణయాన్ని సమర్థించే దేశాలకు ఎగుమతులు నిలిపివేస్తామని రష్యా ఇప్పటికే ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని