RBI: రూ.2వేల నోట్ల ఉపసంహరణ.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావమెంత?

రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారంటే?

Updated : 19 May 2023 21:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటూ రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కరెన్సీపై ప్రజల్లో కాస్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా రూ.2వేల నోట్లు దాచుకున్న వారు కలవర పడుతున్నారు. బ్లాక్‌ మనీ బాబులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రూ.2వేల ఉపసంహరణ నిర్ణయంతో ఎవరికి నష్టం? ఎవరికి కష్టం? ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అనే దానిపై ఆర్థిక రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇది ఎప్పటికైనా తీసుకోవాల్సిన నిర్ణయమే: నరసింహమూర్తి

‘‘2016లో పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో నగదు కొరత ఏర్పడుతుందని భావించిన ఆర్‌బీఐ అప్పటికప్పుడు హడావుడిగా రూ.2వేల నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఆ తర్వాత అవి పూర్తి స్థాయిలో వాడుకలోకి వచ్చాయి. తర్వాత ఆర్‌బీఐ రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ ఆపేసింది. అప్పటి నుంచి ఇక ఎప్పుడైనా ఈ నోట్లను చలామణీలో లేకుండా చేస్తారని భావించాం. ఇప్పటికే రూ.2వేల నోట్లను చాలా వరకు సర్క్యలేషన్‌లో లేకుండా చేశారు. తద్వారా మార్కెట్‌లో ఉన్న బ్లాక్‌మనీని కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా తక్కువ వ్యవధిలో సున్నితంగా నోట్లను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్‌ కరెన్సీ వినియోగం పెరిగినందున ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు. అయితే, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నవారు ఈ నిర్ణయంతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. సెప్టెంబరు 30 వరకు మార్చుకొనేందుకు గడువు ఉన్నందున అప్పటివరకు సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. ఇది ఎప్పటికైనా తీసుకోవాల్సిన నిర్ణయమే’’ అని ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజకీయ నిర్ణయంగానే భావించాలి: అనంత్‌

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోందని ఆర్థిక రంగ నిపుణులు అనంత్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ రూ.2వేల నోట్ల ఉపసంహరణపై  స్పందిస్తూ.. తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘బ్లాక్‌ మనీ తగ్గించడాకే డీమానిటైజేషన్‌ అని కేంద్రం గతంలో చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా మారలేదు. అయినా, ఇప్పుడు మళ్లీ రూ.2వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నారు. కరెన్సీ నోట్లంటే అనుమానం వచ్చే పరిస్థితికి తెచ్చారు. తర్వాత రూ.500 నోట్లు కూడా ఉంటాయో లేదోనని ప్రజల్లో భయం మొదలైంది. ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు.. రూ.2వేల నోట్లు ఎందుకు మారుస్తున్నారు? కారణమేంటి? అనేది బహిరంగంగా ప్రకటించలేదు. చాలా కాలం నుంచి రూ.2వేల నోట్లు ఏటీఎంలలో రావట్లేదు. అయినా, ఆర్‌బీఐ ఈ నోట్లను ఉపసంహరించుకుందంటే కర్ణాటక ఎన్నికల ప్రభావం అనుకోవాలి. అంతకన్నా ఏముంటుంది? 

ఏ నోటు ఎంతకాలం ఉంటుంది? ఎందుకు విత్‌ డ్రా చేశారనేది ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తున్నామని ఆర్‌బీఐ చెబితే.. ఆర్‌బీఐ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుందా? తీసుకుంటే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బోర్డుకు లేదా? ఎందుకు ఉప సంహరించుకుంటున్నారో కారణం చెప్పకుండా అర్ధంతరంగా చేస్తే ఎలా? అసలు రూ.2వేల నోటు ఎందుకు తీసుకొచ్చినట్టు? ముద్రణకు, నగదు సరఫరాకు ఎంత ఖర్చయి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై ఎందుకీ దుబారా?. ఇది ఒక రాజకీయ నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. 

ఎన్నికల కోసం పెద్ద పెద్ద నాయకులు డబ్బు దాచుకున్నారేమో, బ్లాక్‌ మనీ ఉందేమో నన్న అనుమానంతో రూ.2వేల నోట్ల ఉపసంహరించుకున్నట్టు నాకు అనిపిస్తోంది. ఒక వేళ కొందరి వద్ద బ్లాక్‌ మనీ ఉండి ఉంటే డీమానిటైజేషన్‌ విఫలమైనట్టే కదా? వాస్తవాన్ని అంగీకరించకుండా ఇలా చేస్తున్నారా? అని అనిపిస్తోంది. రాజకీయాలు తీసుకొచ్చి ఎకానమీని రాత్రి రాత్రికి మార్చుకోవటం. కాస్ట్లీ ఫెయిల్యూర్‌ పాలసీకి ఇదో నిదర్శనం. ఇలాంటి నిర్ణయాల వల్ల రిజర్వ్‌ బ్యాంకు బోర్డుపై ఉన్న గౌరవం రోజు రోజుకీ తగ్గిపోతోంది. నోట్ల మార్పిడి కోసం గ్రామీణ ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్‌బీఐ ఏ నిర్ణయం తీసుకున్నా మొదట ఇబ్బంది పడుతున్నది సామాన్య ప్రజలే’’ అని అనంత్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

బ్లాక్‌ మనీ కట్టడికి ఈ చర్య ఎంతో ఉపయోగం: కుటుంబరావు

చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకోవాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిర్ణయాన్ని ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, ఆర్థిక రంగ నిపుణులు కుటుంబరావు స్వాగతించారు. దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగేందుకు, నల్లధనం కట్టడికి ఈ చర్య ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ‘‘ఇలాంటి  నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంటుందని మార్చిలోనే భావించాం. ఏటీఎంలలో రూ.2వేల నోట్లు పెట్టడం లేదని.. కావాలని అలా చేస్తున్నారా? ఈ విధంగా ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? అని పలు మీడియా సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. బ్యాంకులే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి’’ అని సీతారామన్‌ బదులిచ్చారు.

ఆర్‌బీఐ ‘‘క్లీన్‌ నోట్‌ పాలసీ’’ (Clean Note policy)ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. లీగల్‌గా, టెండర్‌గా ఉండే ఓ నోటు ఐదు లేదా ఆరు సంవత్సరాలకు మించి మన్నికగా ఉండదు. రూ.2వేల నోట్లు చలామణీలోకి వచ్చి ఐదారేళ్లు గడుస్తున్న నేపథ్యంలో.. ఈ పాలసీ ప్రకారం వాటిని సర్క్యలేషన్‌ నుంచి తీసేయడమో లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం లాంటివి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం మాత్రం రూ. 2వేల నోట్ల పాక్షిక రద్దు (Partial demonetisation) అని చెప్పవచ్చు. 2016లో తీసుకున్న నిర్ణయానికి, ఇప్పుడు తీసుకున్న చర్యకు తేడా ఉంది. అప్పడు పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించిన మరుక్షణం నుంచే అవి (రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు) చెల్లుబాటు కాకుండా పోయాయి. ఇప్పుడు సెప్టెంబరు 30వరకు రూ.2వేల నోట్లు చెల్లుబాటు అవుతాయి. కొన్ని నిబంధనలు పెట్టి మార్చుకోవడానికి వీలు కల్పించారు. ఈ చర్య వల్ల నల్లధనాన్ని అరికట్టేందుకు వీలు ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని