Popular Vehicles IPO: పాపులర్‌ వెహికల్స్‌ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి రూ.280-295

Popular Vehicles IPO: రూ.602 కోట్ల సమీకరణ లక్ష్యంతో పాపులర్‌ వెహికల్స్‌ అండ్‌ సర్వీసెస్ ఐపీఓ మంగళవారం ప్రారంభమైంది.

Published : 12 Mar 2024 13:28 IST

ముంబయి: కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న వాహన డీలర్ల సంస్థ పాపులర్‌ వెహికల్స్‌ అండ్ సర్వీసెస్‌ ఐపీఓ (Popular Vehicles IPO) మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని కంపెనీ రూ.280-295గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.602 కోట్లు సమీకరించనుంది. మదుపర్లు కనీసం రూ.14,750తో 50 షేర్లను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పబ్లిక్‌ ఇష్యూలో (IPO) పాపులర్‌ వెహికల్స్‌ రూ.250 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. మరో రూ.352 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద సమకూర్చుకోనుంది. కంపెనీ ఎండీ నవీన్‌ ఫిలిప్‌ నేతృత్వంలోని ప్రమోటర్లు, కుత్తుకరణ్‌ ఫ్యామిలీ, బన్యన్‌ ట్రీ గ్రోత్‌ క్యాపిటల్‌ ఓఎఫ్‌ఎస్‌లో తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయిస్తున్నారు. ఐపీఓలో అందుబాటులో ఉన్న షేర్లలో 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు 20 శాతం కేటాయించింది. ఉద్యోగుల కోసం 37,453 షేర్లను రిజర్వ్‌ చేసింది. వారికి ప్రత్యేకంగా ఒక్కో షేరుపై రూ.28 రాయితీ ఇస్తోంది.

ఐపీఓ (Popular Vehicles IPO) ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు పాపులర్‌ వెహికల్స్‌ వెల్లడించింది. ఈ కంపెనీని 1983లో స్థాపించారు. దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌ డీలర్‌షిప్‌లను నిర్వహిస్తోంది. వాహన సర్వీసులను అందిస్తోంది. విడి భాగాల విక్రయం, సెకండ్‌ హ్యాండ్ వాహనాల అమ్మకాలు, డ్రైవింగ్‌ స్కూళ్లు, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ పాలసీల పంపిణీ వంటి వ్యాపారాలను కూడా నిర్వహిస్తోంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 40 శాతం పెరిగి రూ.4,892 కోట్లుగా నమోదైంది. పన్నేతర లాభం 90 శాతం పుంజుకొని రూ.64 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని