Interest Rates: మరో పావు శాతం వడ్డన తప్పదు.. ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుపై నిపుణుల అంచనా

Interest Rates: అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఇటీవల వడ్డీరేట్లను పెంచింది. మరోవైపు ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం ఇంకా ఆరు శాతం ఎగువనే నమోదైంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ సైతం వడ్డీరేట్లను పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 26 Mar 2023 17:48 IST

ముంబయి: ద్రవ్యోల్బణం ఇంకా ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి కంటే ఎగువనే ఉంది. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు సైతం కఠిన ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వచ్చే పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్ల (Interest Rates)ను మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశాలు ఏప్రిల్‌ 3, 5, 6 తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్‌ 6న గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తారు.

రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంకా ఎగువస్థాయిల్లోనే కొనసాగుతుండడంపై ఆర్‌బీఐ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అలాగే అమెరికా ఫెడరల్‌ రిజర్వు సహా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఇటీవల వడ్డీరేట్లను పెంచిన అంశాన్నీ ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ రెండే ఆర్‌బీఐ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.

భారీగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022 మే నుంచి వరుసగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన చివరి ద్వైమాసిక సమీక్షలో ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. 2022 నవంబరు, డిసెంబరులో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి అయిన 6 శాతానికి దిగువకు చేరింది. తిరిగి జనవరి, ఫిబ్రవరిలో వరుసగా 6.52 శాతం, 6.44 శాతంగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని