Digital Lenders: రుణగ్రహీత ఇష్టం మేరకే సమాచారం.. డిజిటల్‌ రుణాలపై ఆర్‌బీఐ మార్గదర్శకాలు

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) డిజిటల్‌ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది.

Published : 10 Aug 2022 20:47 IST

దిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) డిజిటల్‌ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఆర్‌బీఐ లేదా ఇతర చట్టపరమైన సంస్థల నియంత్రణలో ఉన్న కంపెనీలకు మాత్రమే రుణాలిచ్చే అధికారం ఉందన్న నిబంధన కింద కేంద్ర బ్యాంకు ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న అనేక సంస్థలను ఆర్‌బీఐ మూడు కేటగిరీలుగా వర్గీకరించింది.

* RBI నియంత్రణలో ఉండి రుణ వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతి ఉన్న సంస్థలు

* ఇతర చట్టబద్ధమైన/నియంత్రణ నిబంధనల ప్రకారం రుణాలు ఇవ్వడానికి అధికారం కలిగి ఉండి RBI నియంత్రణలో లేని సంస్థలు

* చట్టబద్ధమైన/నియంత్రణ నిబంధనలకు వెలుపల రుణాలిచ్చే సంస్థలు

1. తొలి కేటగిరీలోకి వచ్చే సంస్థలను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ తాజాగా మార్గదర్శకాలను రూపొందించింది. ముఖ్యంగా ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలు లేదా ఆర్‌బీఐ నియమించిన ‘లెండింగ్‌ సర్వీసు ప్రొవైడర్లు’ లక్ష్యంగా వీటిని తీసుకొచ్చారు.

2.రెండో కేటగిరీలోకి వచ్చే సంస్థలకు ఆర్‌బీఐ నియమించిన ‘డిజిటల్ లెండర్స్‌ వర్కింగ్ గ్రూప్’ సిఫార్సుల ఆధారంగా డిజిటల్ రుణాలపై తగిన నియమాలు/నిబంధనలను రూపొందించడం/అమలు చేసే అంశాన్ని సంబంధిత చట్టబద్ధమైన సంస్థలు పరిగణించవచ్చు.

3. మూడో కేటగిరీలోకి వచ్చే సంస్థలు చట్టవిరుద్ధమైన రుణ పంపిణీ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం తగిన శాసన, సంస్థాగత చర్యలను చేపట్టాలని వర్కింగ్ గ్రూప్ సూచించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

మార్గదర్శకాలివే..

  • ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలు లేదా ఎల్‌ఎస్‌పీలు రుణ మంజూరు, తిరిగి చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా సంస్థలు, రుణగ్రహీత బ్యాంకు ఖాతాల మధ్యే నిర్వహించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 
  • రుణ మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎల్‌ఎస్‌పీలకు చెల్లించాల్సిన ఫీజులు, ఛార్జీలను నేరుగా నియంత్రిత సంస్థలే చెల్లించాలి. దీంతో రుణగ్రహీతలకు సంబంధం లేదు. 
  • ‘యాన్యువల్‌ పర్సెంటేజ్‌ రేట్‌  (APR)’ రూపంలో డిజిటల్‌ రుణాలకయ్యే ఖర్చులను సంస్థలకు రుణగ్రహీతలకు తెలియజేయాలి.
  • రుణ గ్రహీతల అనుమతి లేకుండా రుణ అర్హత పరిమితిని పెంచడానికి వీల్లేదు.
  • రుణ యాప్‌లు అవసరం మేరకు మాత్రమే గ్రహీతల సమాచారాన్ని సేకరించాలి. అదీ వారి అనుమతితోనే జరగాలి.
  • ఏదైనా సమాచారాన్ని వినియోగించుకోవడానికి రుణ గ్రహీతలు అనుమతించడం లేదా నిరాకరించే వెసులుబాటును వారికి కల్పించాలి. అవసరమైతే ఇచ్చిన అనుమతిని రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పించాలి.
  • రుణ యాప్‌ల ద్వారా ఇచ్చిన రుణాలకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీలు కచ్చితంగా క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ కంపెనీలకు అందించాలి. ముఖ్యంగా ‘బై నౌ పే లేటర్‌’ ఆప్షన్‌ ఇస్తున్న సంస్థలను ఉద్దేశించి ఈ నిబంధనను రూపొందించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని