Russian Oil: రష్యా రాయితీ చమురులో 45% ‘నయారా, రిలయన్స్‌’కే!

ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల వ్యవధిలో భారత్‌ సగటున రోజుకు రష్యా నుంచి 8,70,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా.. దీంట్లో  3,85,000 బ్యారెళ్లు రిలయన్స్‌, నయారాకే వెళ్లినట్లు వోర్టెక్సా వెల్లడించింది.

Published : 14 Mar 2023 10:53 IST

దిల్లీ: రష్యా (Russia) నుంచి భారత్‌ భారీ ఎత్తున చమురు (Crude Oil)ను దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మొత్తం చమురు (Crude Oil) దిగుమతుల్లో రష్యా (Russia) వాటా 1 శాతం కాగా.. ఇప్పుడది 35 శాతానికి చేరింది. పశ్చిమ దేశాల ఆంక్షల తర్వాత రాయితీ ధరకే రష్యా చమురును అందిస్తుండడమే దీనికి కారణం. అయితే, ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న చమురులో 45 శాతం ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, రష్యా మద్దతు ఉన్న నయారా ఎనర్జీకే వెళ్తున్నట్లు ఇంధన సరఫరా సమాచారాన్ని సేకరించే వోర్టెక్సా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల వ్యవధిలో భారత్‌ సగటున రోజుకు రష్యా నుంచి 8,70,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఇది భారత మొత్తం చమురు దిగుమతుల్లో 20 శాతానికి సమానం. దీంట్లో 3,85,000 బ్యారెళ్లు రిలయన్స్‌, నయారాకే వెళ్లినట్లు వోర్టెక్సా వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం, ఎంఆర్‌పీఎల్‌ 4,84,000 బ్యారెళ్లను దిగుమతి చేసుకున్నట్లు పేర్కొంది. రష్యా రాయితీల వల్ల ప్రైవేట్‌ కంపెనీలు అధికంగా లాభపడినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. యుద్ధ ఆరంభ సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆయా కంపెనీలు లబ్ధి పొందాయని వివరించాయి.

రష్యా (Russia) నుంచి భారత్‌కు చమురు (Crude Oil) దిగుమతి 2023 ఫిబ్రవరిలో మరింత పెరిగింది. మన దేశానికి చమురు (Crude Oil) సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రష్యా (Russia) వరుసగా ఐదోనెలా తొలిస్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 16 లక్షల పీపాలకు పైగా చమురు (Crude Oil) దిగుమతి అయినట్లు వోర్టెక్సా వెల్లడించింది. ఇది ఇరాక్‌, సౌదీ అరేబియా.. రెండూ కలిపి భారత్‌కు సరఫరా చేస్తున్న చమురు కంటే ఎక్కువ కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని