Reliance: మరో బెవరేజెస్‌ కంపెనీలో రిలయన్స్‌కు మెజారిటీ వాటా

ఇప్పటికే కంపా బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్‌ తాజాగా మరో బెవరేజెస్‌ కంపెనీ సొస్యోలో మెజారిటీ వాటాలు తీసుకుంది.

Published : 05 Jan 2023 00:30 IST

ముంబయి: ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్‌ (Reliance) ఇండియా మరో ముందడుగు వేసింది. గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘సొస్యో హజూరీ బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (SHBPL)’లో ‘రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌’ 51 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. సోస్యో బ్రాండ్‌ పేరిట ఎస్‌హెచ్‌బీపీఎల్‌ పలు రకాల పానీయాలను విక్రయిస్తోంది. కంపెనీలో మిగిలిన వాటాలు ప్రస్తుత ప్రమోటర్‌ హజూరీ కుటుంబం చేతిలోనే ఉండనున్నాయి.

పండ్ల రసాలు, కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్‌ వ్యాపారంలో సొస్యో దాదాపు 100 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీని 1923లో అబ్బాస్‌ అబ్దుల్‌రహీమ్‌ హజూరీ స్థాపించారు. దేశీయ సాఫ్ట్‌ డ్రింక్స్‌ విపణిలో ఈ కంపెనీకి పెద్ద వాటానే ఉంది. సొస్యో, కశ్మీరా, లెమీ, గిన్‌లిమ్‌, రన్నర్‌, ఓపెనర్‌, హజూరీ సోడా బ్రాండ్ల పేరిట 100 రకాలకు పైగా ఫ్లేవర్లలో పానీయాలను విక్రయిస్తోంది. ముఖ్యంగా గుజరాత్‌లో ఈ కంపెనీ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉంది.

రిలయన్స్‌ ఇప్పటికే పానీయాల రంగంలో ‘కంపా’ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సొస్యోకు కొత్త రకాల పానీయాలను రూపొందించడంలో మంచి అనుభవం ఉంది. కంపా బ్రాండ్‌కు ఉన్న గుర్తింపు, కొత్త రకాల పానీయాల తయారీలో సొస్యోకు ఉన్న అనుభవం రిలయన్స్‌ బెవరేజెస్‌ సెగ్మెంట్‌ బలోపేతానికి ఉపయోగపడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని