SEBI: ఐపీఓ ధరల్ని నిర్ణయించడం సెబీ పని కాదు!

కొత్తతరం సాంకేతిక కంపెనీల పబ్లిక్‌ ఇష్యూ ధరల్ని నిర్ణయించడం స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ పని కాదని సంస్థ ఛైర్‌పర్సన్‌ మాధవీ పురీ బుచ్‌ తెలిపారు....

Published : 13 Sep 2022 17:37 IST

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవీ పురీ బుచ్‌

ముంబయి: కొత్తతరం సాంకేతిక కంపెనీల పబ్లిక్‌ ఇష్యూ ధరల్ని నిర్ణయించడం స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ పని కాదని సంస్థ ఛైర్‌పర్సన్‌ మాధవీ పురీ బుచ్‌ తెలిపారు. ఫిక్కీ నిర్వహించిన క్యాపిటల్‌ మార్కెట్‌ వార్షిక సదస్సులో మంగళవారం మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, ప్రీ-మార్కెట్‌ ప్లేస్‌మెంట్‌ షేరు ధరతో పోలిస్తే ఐపీఓ ధర ఎక్కువ ఉండడానికి గల కారణాన్ని మాత్రం టెక్‌ కంపెనీలు వెల్లడించాలని మాధవీ పురీ తెలిపారు. ఈ విషయాన్ని ఆమె సోదాహరణంగా వివరించారు. ఓ కంపెనీ ప్రీ-మార్కెట్‌ ప్లేస్‌మెంట్‌లో ఒక్కో షేరుని రూ.100కు మదుపర్లకు కేటాయిస్తే.. కొన్ని నెలల వ్యవధిలోనే ఐపీఓలో అదే షేరు ధరను రూ.450గా నిర్ణయిస్తున్నారని తెలిపారు. ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ కంపెనీలకు ఉన్నప్పటికీ.. షేరు విలువలో ఒకేసారి అంత వ్యత్యాసం రావడానికి ఏం దోహదం చేసిందో వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ మధ్యకాలంలో ఐపీఓకి వచ్చిన కొన్ని టెక్‌ కంపెనీలు.. ఇష్యూ ధరను భారీగా నిర్ణయించాయనే వాదన పరిశ్రమ వర్గాల్లో ఉంది. వాటిలో చాలా కంపెనీల షేర్లు తర్వాత పతనాన్ని చవిచూశాయి. దీంతో ముఖ్యంగా చిన్న మదుపర్లు భారీ ఎత్తున నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే కొత్తతరం సాంకేతిక కంపెనీల ఐపీఓ ధరలపై సెబీ మార్గదర్శకాలు జారీ చేయాలనే డిమాండ్‌ వచ్చింది. అలాంటి కొన్ని కంపెనీలను ఉదహరిస్తూ వీటి విషయంలో ఏం చేయాలని సదస్సులో కొంత మంది మాధవీ పురీని ప్రశ్నించారు. దీనికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని