Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం, దిగ్గజ షేర్లు రాణించడం సూచీల లాభాలకు దన్నుగా నిలిచాయి.

Updated : 04 Oct 2022 16:07 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు మంగళవారం దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీల ర్యాలీకి దోహదం చేశాయి. నిఫ్టీ50 ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా పెరిగి 17,200 ఎగువకు చేరింది. సెప్టెంబరు 23 తర్వాత నిఫ్టీ మళ్లీ ఈ స్థాయిని అందుకుంది. మరోవైపు సెన్సెక్స్‌ 1,200 పాయింట్లకు పైగా ఎగబాకి 58,099.94 వద్ద గరిష్ఠానికి చేరింది. మరోవైపు బజాజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, టీసీఎస్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజాలు రాణించడం కూడా సూచీల పరుగుకు కారణమైంది. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌100, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీలు సైతం 1 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు ఐటీ, బ్యాంకింగ్‌, లోహ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది.

ఈ నెల మొత్తం బుల్లిష్‌ సెంటిమెంట్‌ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిది సంవత్సరాలు మార్కెట్లు ఈ నెలలో రాణించిన దాఖలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా డాలర్‌, ట్రెజరీ బాండ్ల వడ్డీలు తగ్గుముఖం పట్టడం కూడా సూచీలకు కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇదే పోకడ కొనసాగితే.. ఈ నెలలో విదేశీ మదుపర్లు తిరిగి భారత్‌లో పెట్టుబడులు కుమ్మరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సెన్సెక్స్‌ ఉదయం 57,506.65 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 58,099.94 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1276.66 పాయింట్ల లాభంతో 58,065.47 వద్ద ముగిసింది. 17,147.45 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 386.95 పాయింట్లు ఎగబాకి 17,274.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,287.30 వద్ద గరిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.81.52 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌ రాణించిన షేర్లలో ఉన్నాయి.

ఈ రోజు మార్కెట్ల ర్యాలీకి దోహదం చేసిన నాలుగు కీలక అంశాలు..

బలమైన అంతర్జాతీయ సంకేతాలు: గతవారం భారీగా కుంగిన అమెరికా మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. అక్కడి మూడు ప్రధాన సూచీలైన నాస్డాక్‌, ఎస్‌అండ్‌పీ 2 శాతం, డోజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.8 శాతం లాభపడింది. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం అమెరికా మార్కెట్ల బాటలోనే పయనించాయి. సంపన్నులపై పన్నును తొలగించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించడమే ప్రపంచ మార్కెట్ల రాణించడానికి దోహదం చేసింది.

విదేశీ మదుపర్ల కొనుగోళ్లు: రెండు నెలల విరామం తర్వాత సెప్టెంబరులో తిరిగి నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ మదుపర్లు.. అక్టోబరు నెలను కొనుగోళ్లతో ప్రారంభించారు. సోమవారం రూ.590 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

రూపాయికి బలం: గతకొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న రూపాయి.. నిన్న, ఈరోజు గణనీయంగా పుంజుకుంది. మరోవైపు డాలర్‌ బలహీనపడడం కూడా మదుపర్ల సెంటిమెంటును పెంచింది.

దిగ్గజ షేర్లకు కొనుగోళ్లు: పై సానుకూలతల నేపథ్యంలో దిగ్గజ షేర్లయిన బజాజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, టీసీఎస్‌, ఐటీసీ, రిలయన్స్ రాణించడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

బ్రెంట్‌ ముడి చమురు ధరలు ఇటీవలి కనిష్ఠాల నుంచి పెరిగి బ్యారెల్‌ ధర 89 డాలర్లకు చేరిన నేపథ్యంలో పెయింట్స్‌ స్టాక్‌ ఈరోజు మిశ్రమంగా స్పందించాయి. ఏషియన్‌ పెయింట్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, శాలిమార్‌ పెయింట్స్‌, ఇండిగో పెయింట్స్‌ రాణించగా.. నెరోలాక్‌, అక్జో నోబెల్‌ డీలాపడ్డాయి.

ఐనాక్స్‌ విండ్‌ ఎనర్జీ షేరు ఇంట్రాడేలో 5 శాతానికి పైగా పెరిగి రూ.1,010 వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. గత ఆరు వారాల్లో ఈ షేరు ధర 101 శాతం పుంజుకోవడం గమనార్హం. గత వారం రోజుల్లో 26 శాతం పెరిగింది. పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టాక్‌ రాణిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈరోజు 4.49 శాతం లాభంతో రూ.1,000 వద్ద స్థిరపడింది.

భారీ క్రయవిక్రయాల నేపథ్యంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతానికి పైగా పుంజుకుని రూ.53.75 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకాయి. గత మూడు నెలల్లో ఈ స్టాక్‌ ధర 60 శాతం పెరగడం గమనార్హం. చివరకు ఈరోజు 8.11 శాతం లాభంతో రూ.53.35 వద్ద ముగిసింది. 

బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ షేర్లు గతవారం రోజుల్లో 14 శాతం పెరిగాయి. వచ్చే ఏడాది షిప్‌మెంట్‌ ఛార్జీలను 10 శాతం పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చివరకు ఈ షేరు 4.08 శాతం లాభపడి రూ.9370 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని