IPO ఎఫెక్ట్‌తో దూసుకెళ్లిన టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ స్టాక్స్‌.. ఒక్కో షేరుపై ₹1200 లాభం!

Tata tech IPO: టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ నేపథ్యంలో టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్లు దూసుకెళ్లాయి. సోమవారం 15 శాతం లాభపడి 52 వారాల గరిష్ఠానికి చేరాయి.

Published : 20 Nov 2023 18:03 IST

Tata Technologies IPO| ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌ (Tata Investment) షేర్లు దూసుకెళ్లాయి. సోమవారం ట్రేడింగ్‌లో 15 శాతం లాభపడ్డాయి. దీంతో 52 వారాల గరిష్ఠానికి చేరాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌లో (నవంబర్‌ 17న) సైతం కంపెనీ షేరు 20 శాతం మేర పెరిగింది. గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో షేరు విలువ దాదాపు 40 శాతం మేర పెరగడం గమనార్హం. నవంబర్‌ 13న ఎన్‌ఎస్‌ఈలో షేరు విలువ రూ.3,233 ఉండగా.. సోమవారం నాటికి రూ.4,474కు చేరడం గమనార్హం. అంటే ఒక్కో షేరుపై మదుపరులకు రూ.1240 మేర లాభం వచ్చింది.

నవంబర్‌ 22న టాటా టెక్నాలజీ కంపెనీ ఐపీఓకు (Tata tech IPO) వస్తుండడమే టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లో ఈ ర్యాలీకి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ అనేది నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ. టాటా టెక్నాలజీస్ మాతృ సంస్థ అయిన టాటా మోటార్స్‌కు ఇది ప్రమోటర్‌ గ్రూప్‌. టాటా గ్రూప్‌ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా స్టీల్‌, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్‌, టాటా కెమికల్‌ వంటి కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. 

కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు.. వీటిపై ఓ లుక్కేయండి!

టాటా టెక్నాలజీ ఐపీఓ నవంబర్‌ 22న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. నవంబర్‌ 24న ముగియనుంది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించింది. ఈ లెక్కన అత్యధిక ధర వద్ద కంపెనీ రూ.3,042 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపరులు కనీసం 30 షేర్లను కొనాల్సి ఉంటుంది. దీని ప్రకారం గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.15 వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీఓ కావడంతో మదుపరుల్లో ఆసక్తి నెలకొంది.

గమనిక: ఈ వార్త/కథనం సమాచారం కోసం మాత్రమే. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులను ఈనాడు.నెట్‌ ప్రోత్సహించడం లేదు. ఆర్థిక నిపుణుల సలహా మేరకు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని