Moonlighting: మూన్‌లైటింగ్‌పై టెక్‌ మహీంద్రా సానుకూల ప్రకటన

మూన్‌లైటింగ్‌పై టెక్‌మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఉద్యోగులు అదనపు పనులు చేసుకోవడంలో తమకు అభ్యంతరమేమీ లేదని సీఈఓ గుర్నారీ తెలిపారు. దీనిపై ఓ విధానాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

Published : 02 Nov 2022 14:48 IST

దిల్లీ: తమ ఉద్యోగులు ఖాళీ సమయాల్లో ఇతర పనులు చేసుకునేందుకు అనుమతించేలా మూన్‌లైటింగ్‌ (Moonlighting) విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నట్లు టెక్‌ మహీంద్రా (Tech Mahindra) తెలిపింది. అయితే, దీనికి కొన్ని షరతులు ఉండొచ్చని సీఈఓ, ఎండీ సి.పి.గుర్నానీ సంకేతాలిచ్చారు. కంపెనీ నిబంధనల్ని అనుసరిస్తూ ఇతర ఉద్యోగాలు చేసుకోవడంలో తమకు అభ్యంతరమేమీ లేదని తెలిపారు. 

తమ కంపెనీ 90 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోందని గుర్నానీ గుర్తుచేశారు. అన్ని ప్రాంతాల కార్మిక చట్టాల్ని అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. తమ ఉద్యోగులు ఉత్పాదకతను పెంచుకుంటే తామూ సంతోషిస్తామని చెప్పారు. అయితే, కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఏం చేస్తున్నారో కూడా కంపెనీ వర్గాలకు చెప్పి అనుమతి తీసుకుంటే సరిపోతుందన్నారు. ఇలాంటి విషయాల్ని దాచిపెట్టడం సరికాదన్నారు. అలా చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.

మరోవైపు కొత్త నియామకాల్ని తాము నిలిపివేస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. భవిష్యత్తుపై ఇన్వెస్ట్‌ చేస్తున్న తాము కొత్త తరాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నామన్నారు. జులై- సెప్టెంబరులో టెక్‌ మహీంద్రా ఏకీకృత ప్రాతిపదికన రూ.1,285 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22లో ఇదే త్రైమాసిక లాభం రూ.1,339 కోట్లతో పోలిస్తే ఇది 4 శాతం తక్కువ. ఆదాయం రూ.10,881 కోట్ల నుంచి 20.7 శాతం పెరిగి రూ.13,129 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికంలో 802 మిలియన్‌ డాలర్ల ఆర్డర్లు లభించగా, సమీక్షా త్రైమాసికంలో ఇవి 716 మి.డా.కు పరిమితమయ్యాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.63 లక్షలకు చేరిందని కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని