Bouncy Castle: గాలులకు ఎగిరిపోయిన బౌన్సి క్యాసల్‌.. నలుగురు చిన్నారుల మృత్యువాత

పాఠశాల చివరి రోజు.. తర్వాత క్రిస్మస్‌ సెలవులు.. ఈ సంతోషంలోనే ఆటలాడుకుంటున్నారు ఓ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు. వారిలో కొంతమంది బౌన్సి క్యాసల్‌పై ఉత్సాహంగా గంతులేస్తున్నారు. కానీ, ఈ చిన్నారులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒక్కసారిగా వీచిన...

Published : 17 Dec 2021 01:38 IST

కాన్‌బెర్రా: పాఠశాల చివరి రోజు.. తర్వాత క్రిస్మస్‌ సెలవులు.. ఈ సంతోషంలోనే ఆటలాడుకుంటున్నారు ఓ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు. వారిలో కొంతమంది బౌన్సి క్యాసల్‌పై ఉత్సాహంగా గంతులేస్తున్నారు. కానీ, ఈ చిన్నారులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు ఆ క్యాసల్‌ కాస్త.. అమాంతం పది మీటర్లకుపైగా ఎత్తుకు ఎగిరిపోయింది. పిల్లలూ దాంట్లోనే ఉన్నారు. క్షణాల్లోనే అంతెత్తునుంచి ఒక్కసారిగా కిందపడిన ఘటనలో.. వారిలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలోని ఉత్తర టాస్మానియాలో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది.

10-12 ఏళ్లలోపు వారే..

విద్యాసంవత్సరం ముగియనుండటంతో.. ఇక్కడి డెవాన్‌పోర్ట్‌లోని హిల్‌క్రెస్ట్‌ ప్రైమరీ స్కూల్‌ యాజమాన్యం పిల్లలకు ఈ ఏర్పాట్లు చేసింది. వారి తల్లిదండ్రులనూ ఆహ్వానించింది. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ‘నలుగురు పిల్లలు చనిపోయారు. మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది’ అని స్థానిక పోలీసు కమిషనర్ డారెన్ హైన్ చెప్పారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని, వారంతా 10- 12 ఏళ్లలోపు వారేనని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ హెలికాప్టర్లు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని