Nizamabad: అపహరించిన కారులో వచ్చి.. ఏటీఎం లూటీ

అపహరించిన కారులో వచ్చిన దొంగలు ఏటీఎంలోని డబ్బునంతా ఊడ్చుకెళ్లారు. అందుకు గ్యాస్‌కట్టర్‌తో యంత్రాన్ని ధ్వంసం చేశారు.

Updated : 28 Sep 2023 06:53 IST

గ్యాస్‌కట్టర్‌తో యంత్రం ధ్వంసం..
రూ.12 లక్షల చోరీ

బాల్కొండ, న్యూస్‌టుడే: అపహరించిన కారులో వచ్చిన దొంగలు ఏటీఎంలోని డబ్బునంతా ఊడ్చుకెళ్లారు. అందుకు గ్యాస్‌కట్టర్‌తో యంత్రాన్ని ధ్వంసం చేశారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దొంగలు మంగళవారం అర్ధరాత్రి డిచ్‌పల్లిలో ఆపి ఉన్న ఓ కారును చోరీ చేశారు. అక్కడి నుంచి అందులోనే బుధవారం వేకువజామున దూద్‌గాం శివారులోని పోచంపాడ్‌ ఎస్‌బీఐ శాఖ ఏటీఎం వద్దకు వెళ్లారు. ఏటీఏం ఉన్న గది షట్టర్‌ను గ్యాస్‌కట్టర్‌తో ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు అందులోని సీసీ కెమెరాకు నల్లటి రంగు పూశారు. ఏటీఎంను కూడా గ్యాస్‌కట్టర్‌తో ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.12 లక్షలు ఎత్తుకెళ్లారు. అనంతరం కారులో పారిపోయారు. దొంగలు చోరీకి పాల్పడుతున్న సమయంలో నిజామాబాద్‌లోని బ్యాంకు ఉద్యోగి రషీద్‌కు అలారాం మెసేజ్‌ వచ్చింది. ఆయన వెంటనే స్థానిక పోలీసులు, బ్యాంకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకొనేలోపే దొంగలు యంత్రంలోని డబ్బును దోచుకుని పరారయ్యారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్‌ అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) జయరాం, ఆర్మూర్‌ ఏసీపీ జగదీశ్‌చందర్‌, డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీం సభ్యులు పరిశీలించారు. చోరీ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మూర్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి, మెండోరా ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని