ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం

ఈనాడు-హైదరాబాద్‌: మెదక్‌ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఓ దుండగుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలవరం రేపింది.

Updated : 31 Oct 2023 07:07 IST

కత్తితో దాడి చేసిన దుండగుడు
ఎన్నికల ప్రచారంలో ఉండగా ఘటన
తీవ్ర గాయాలు.. యశోద ఆసుపత్రికి తరలింపు
చిన్నపేగుకు అత్యవసర శస్త్రచికిత్స
పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు

దౌల్తాబాద్‌, చేగుంట, మిరుదొడ్డి, గజ్వేల్‌, రెజిమెంటల్‌బజార్‌-న్యూస్‌టుడే: ఈనాడు-హైదరాబాద్‌: మెదక్‌ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఓ దుండగుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలవరం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని గాజులపల్లి, దొమ్మాట, ముత్యంపేటలో ప్రచారం ముగించుకొని సూరంపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్‌ అంజయ్యను పరామర్శించారు. తిరిగి బయలుదేరేందుకు కారు వద్దకు రాగా.. ఆయనతో కొందరు స్థానికులు సెల్ఫీలు దిగారు. అదే సమయంలో మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలకు చెందిన గట్టని రాజు(38) ఎంపీతో కరచాలనం చేసేందుకు వచ్చినట్లు వెనుక నుంచి చేయి చాపుతూ ఆకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీసి.. ఎంపీ కుడివైపు పొట్టలో పొడిచాడు. ఎంపీ వెంట ఉన్న గన్‌మెన్‌ ప్రభాకర్‌ వెంటనే తేరుకొని రాజును పట్టుకుని కత్తిని లాగేసుకోగా.. చుట్టూ ఉన్న భారాస నాయకులు, కార్యకర్తలు అతన్ని కొట్టారు. ఎంపీని కార్యకర్తలు కారులో గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు కుట్లు వేశారు. వారి సూచనల మేరకు ప్రభాకర్‌రెడ్డిని సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పొట్టలో కత్తితో పొడవడంతో చిన్న పేగుకు తీవ్ర గాయమైందని, పొట్టలోనే తీవ్ర రక్తస్రావమైందని యశోద వైద్యులు తెలిపారు.

ఎంపీకి అత్యవసర చికిత్స అనంతరం వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘తొలుత పొట్టపైనే గాయం తగిలిందని భావించినా... సీటీ స్కాన్‌లో పొట్ట లోపలి వరకు కత్తి గాటు దిగినట్లు గుర్తించాం. నిందితుడు కత్తిని అటూఇటూ తిప్పడంతో పేగు లోపలికి వెళ్లి గాయం చేసింది. దాదాపు 10 సెంటీమీటర్ల వరకు పేగు పూర్తిగా దెబ్బతింది. ఓపెన్‌ లాపరోటమీ చేసి దెబ్బతిన్న పేగును తొలగించాం. ఇందుకు మూడున్నర గంటల పాటు సమయం పట్టింది. అనంతరం ఐసీయూకు తరలించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరో వారం నుంచి పది రోజులపాటు చికిత్స అందించాల్సి ఉంది’ అని వివరించారు. ప్రస్తుతం పోస్ట్‌ ఆపరేటివ్‌ సర్జికల్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఎంపీని ఆసుపత్రికి సకాలంలో తరలించడంలో చొరవ చూపిన పోలీసు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవల సిబ్బందిని అభినందించారు. ఇలాంటి కేసుల్లో ఏమాత్రం జాప్యం జరిగినా.. పేగు ఇస్కీమియా, పెరిటోనిటిస్‌, ఇతర సమస్యలకు దారితీసి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆసుపత్రికి చెందిన సర్జికల్‌ గాస్ట్రోఎంటరాలజీ వైద్యులు డాక్టర్‌ టీఎల్‌వీడీ ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో పది మందితో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఎంపీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

పరామర్శించిన కేసీఆర్‌

కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరుకుని ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి ఎండీ జీఎస్‌రావు, ఇతర వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రికి భారీసంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు సీఎం ధైర్యం చెప్పారు. ఆయన వెంట మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు ఉన్నారు. 

ప్రజాస్వామ్యంలో దాడులు మంచి పద్ధతి కాదు: హరీశ్‌రావు

ప్రజాస్వామ్యంలో ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కొనాలని, భౌతిక దాడులకు దిగడం సరికాదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆయన పరామర్శించారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రభాకర్‌రెడ్డి చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తి అని అన్నారు. ఎంపీగా పదేళ్లుగా మెదక్‌ ప్రజలకు ఎన్నో మంచి సేవలందిస్తున్న ఆయనపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఎంపీపై నిందితుడు దాడి చేసిన వెంటనే పక్కన ఉన్న గన్‌మెన్‌ అతడి చేయి పట్టుకొని వెనక్కి లాగడంతో ఆయన చేయి కూడా కోసుకుపోయిందని తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో నిందితుడు బాగా తాగిఉన్నట్లు తెలుస్తోందని.. దీని వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. మంత్రులు కేటీఆర్‌, తలసాని, మల్లారెడ్డి, ఎంపీ కేశవరావు, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు ఆసుపత్రికి వచ్చి ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు. దుబ్బాక అసెంబ్లీ, మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన భారాస కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆసుపత్రికి వద్దకు తరలివచ్చారు. ఆందోళన చేపట్టారు. రఘునందన్‌రావు డౌన్‌ డౌన్‌.. భాజపా రౌడీల్లారా ఖబడ్దార్‌ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్న నాయకులను ఆసుపత్రి నుంచి బయటకు పంపించేశారు.

ఆన్‌లైన్‌ పత్రికలు, యూట్యూబ్‌ ఛానళ్లలో పనిచేసిన నిందితుడు

పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీపై హత్యాయత్నం చేసిన రాజు మొదటి నుంచి జులాయిగా తిరుగుతుంటాడు. ఏడో తరగతి వరకు చదివాడు. వివిధ ఆన్‌లైన్‌ పత్రికలు, యూట్యూబ్‌ ఛానళ్లలో పనిచేశాడు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరాడు. ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలకంగా లేడు. విలేకరిని అంటూ పలువురిని బెదిరిస్తూ వసూళ్లకు, అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. గ్రామస్థులు మూడేళ్ల క్రితం మిరుదొడ్డి ఠాణాలో ఫిర్యాదు చేయగా.. మందలించి వదిలిపెట్టారు. నిందితుడు మద్యానికి బానిసయ్యాడు. సోమవారం ఉదయం మిరుదొడ్డిలోని ఓ దుకాణంలో కత్తి కొన్నట్టు తెలుస్తోంది. దళితబంధుతో పాటు ఇంటి స్థలాలకు అర్హులైన విలేకరుల జాబితాలో తన పేరు లేదనే కోపంతోనే ఎంపీపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. రాజును పోలీసులు దౌల్తాబాద్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసు కమిషనర్‌ శ్వేత పరిశీలించారు. పెద్దచెప్యాలలోని నిందితుడి ఇంటి వద్ద, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా దుబ్బాక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని