Bulli Bai: ‘బుల్లీబయ్’ యాప్‌ క్రియేటర్‌ అరెస్ట్..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బుల్లీ బాయ్‌’ కేసులో యాప్‌ సృష్టికర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్‌ను దిల్లీ పోలీసులు అసాంలో పట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Updated : 07 Jan 2022 01:50 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బుల్లీ బయ్‌’ కేసులో యాప్‌ సృష్టికర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్‌ను దిల్లీ పోలీసులు అసాంలో పట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  దీంతో ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు అరెస్టయ్యారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నీరజ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతడు గిట్‌హబ్‌ ప్లాట్‌ఫాంలో ఈ యాప్‌ రూపొందించినట్లు వెల్లడించాయి. అలాగే మహిళలకు సంబంధించిన అభ్యంతరకర చిత్రాలు అతడి ట్విటర్ ఖాతా నుంచే వచ్చినట్లు తెలిపాయి. 

సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన కొందరు మహిళల ఫొటోలను మార్చి దుండగులు బుల్లీ బయ్ యాప్‌లో ఉంచారు. వర్చువల్ వేలం కోసం వారి అనుమతి లేకుండానే ఫొటోలు ఆ యాప్‌లో అప్‌లోడ్‌ అవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన మహిళల చిత్రాలను మాత్రమే ఉంచుతున్నట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి 21 ఏళ్ల మయాంక్‌ రావల్‌, విశాల్‌ కుమార్‌ ఝా, మరో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకొన్నారు. నిందితుడు విశాల్‌కు 10వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని