సీఎం ఇంటిని ముట్టడిస్తే అత్యాచారయత్నం కేసా?

ఏపీ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన విద్యార్థులపై పోలీసులు అత్యాచారయత్నం కేసుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ముట్టడికి యత్నించిన ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద........

Published : 24 Jan 2021 01:35 IST

తాడేపల్లి పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన విద్యార్థులపై పోలీసులు అత్యాచారయత్నం కేసుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ముట్టడికి యత్నించిన ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో రిమాండ్‌ రిపోర్టులో అత్యాచార యత్నంగా పేర్కొనడంపై మంగళగిరి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల సమస్యలపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఐదుగురు విద్యార్థి నేతలు సీఎం నివాసానికి అర కిలోమీటర్‌ దూరం వరకు వెళ్లగలిగారు. వారిని తెలుగు తల్లి విగ్రహం సమీపంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఐదుగురిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారిని శనివారం మంగళగిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు చూసిన న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రిపోర్టులో అత్యాచారయత్నం అనే పదం వాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది అత్యాచారయత్నం కేసు ఎలా అవుతుందంటూ నిలదీసినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు.. పాత ఎఫ్‌ఐఆర్‌ కాపీలను కంప్యూటర్‌లో మార్చే క్రమంలో ఆ పదాలను మార్చకుండా అలాగే వదిలేయడంతో ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను తిరిగి తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రిమాండ్‌ రిపోర్టులో మార్పులు చేసి సంబంధిత సెక్షన్లను పేర్కొంటూ న్యాయమూర్తికి సమర్పించినట్టు సమాచారం.

అత్యాచార యత్నం కేసులు లేవు: ఎస్పీ 

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థి నేతలపై తాడేపల్లి పోలీసుల కేసుపై ట్విటర్‌ వేదికగా గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి వివరణ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో అత్యాచారయత్నం సంబంధిత సెక్షన్లు ఏమీ లేవన్నారు. రిమాండ్ రిపోర్టు టైప్‌ చేసే సమయంలో పొరపాటు జరిగిందన్నారు. వేరే కేసుకు సంబంధించిన అంశం ఈ కేసుకు అటాచ్‌ అయిందని ఎస్పీ తెలిపారు. ఎలాంటి అత్యాచారయత్నం సెక్షన్లు నమోదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. టైప్‌ చేసే సమయంలో కేవలం ఒక పదం మారి అపార్థం తలెత్తిందని ఎస్పీ వివరణ ఇచ్చారు. 

 

ఇదీ చదవండి..

ఏపీ ‘పంచాయతీ’.. నేతల మాటల యుద్ధం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని