logo

అంతుచిక్కని అల్లోల అంతరంగం

రెండు, మూడు రోజులు ఆగండి.. సార్‌, కాంగ్రెస్‌ పెద్దోళ్లతో మాట్లాడుతున్నారు.. ఆయనతోనేే కలిసి ఆ పార్టీలో చేరుదాం.. తొందరపడి ఎటూ వెళ్లకండి అంటూ భారాసకు చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు పక్షం రోజులుగా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు బుజ్జగిస్తూ వస్తున్నారు.

Updated : 27 Mar 2024 06:28 IST

ఊగిసలాటలో అనుచరులు

నిర్మల్‌, న్యూస్‌టుడే: రెండు, మూడు రోజులు ఆగండి.. సార్‌, కాంగ్రెస్‌ పెద్దోళ్లతో మాట్లాడుతున్నారు.. ఆయనతోనేే కలిసి ఆ పార్టీలో చేరుదాం.. తొందరపడి ఎటూ వెళ్లకండి అంటూ భారాసకు చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు పక్షం రోజులుగా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు బుజ్జగిస్తూ వస్తున్నారు. ఆ మాటలు నమ్మిన కొందరు వేచి చూస్తుండగా.. మరికొందరు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. భారాస ప్రజాప్రతినిధులు, వివిధ పదవులు చేపట్టిన నేతలు ఒక్కొక్కరు కారు దిగిపోతున్నా.. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం తన అంతరంగాన్ని బయటపెట్టడం లేదు. అసలు హస్తం గూటిలో చేరుతారా.. ఆగుతారా అనేది తేలకపోవడంతో ఇన్నాళ్లూ ఆయనతో పనిచేసిన నేతలు, అనుచరులు ఊగిసలాటలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మాజీ మంత్రిని కాదని కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కొద్ది రోజులకే ఆయన అదే పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.

ఇప్పటికే ఆలస్యం అవుతుందని...

మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారన్న ప్రచారం దాదాపు 20 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లూ ఆయనతోనే హస్తం గూటిలో చేరుదామని ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్లు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, భారాస వివిధ విభాగాల బాధ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భావించినా.. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లడైన విషయం తెలిసిందే. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరిక వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదని భావించిన వారంతా భారాసను వీడి ‘చే’యందుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారాస జిల్లా అధ్యక్షుడు, ముథోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరగా.. మామడ మండల ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ గంగారెడ్డి, ఆరెపల్లి మాజీ సర్పంచి అరవిందరావు, పొన్కల్‌ మాజీ ఉప సర్పంచి నరేశ్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు హస్తం పార్టీలో చేరారు. నాలుగు రోజుల క్రితం నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో మంత్రి సీతక్క సమక్షంలో నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి, 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

భవిష్యత్తు కోసమంటూ...

అధికార బలం ఉన్న వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా కలిసొస్తుందనేది తెలిసిందే. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుతో మున్సిపల్‌ పాలకవర్గాల గడువు ముగిసిపోతుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం భారాస ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఆశావహులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ భారాస ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో రాజకీయంగా రానున్న రోజుల్లో తమకు అవకాశం లేకనే ఆ పార్టీని వీడుతున్నామని భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు చెబుతుండటం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల సమయంలో చేరికలతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని