logo

అర్ధరాత్రి అలజడులు..

అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఒంటరిగా నడవడం మాట దేవుడెరుగు. పురుషులు కూడా ధైర్యంగా బయటి నుంచి ఇంటికి సురక్షితంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

Updated : 16 Apr 2024 06:09 IST

జిల్లాలో పెరుగుతున్న విష సంస్కృతి

జిల్లా కేంద్రంలో రోడ్డుపై గొడవలో అల్లరిమూకలు

‘ఇటీవల జిల్లా కేంద్రంలోని లక్షెట్టిపేట  రోడ్డులో ఆటో దిగిన ఓ వృద్ధుడిని కిడ్నాప్‌ చేసి అతని వద్ద ఉన్న రూ. 6వేల నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.’

‘జిల్లా కేంద్రంలో ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి రెండు వర్గాలకు చెందిన యువకులు క్రికెట్‌ వికెట్లు, బ్యాట్‌లతో రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. గొడవలో ఉన్న యువకులు గతంలోనూ పలు కేసులలో నిందితులే.’

‘ఆరునెలల కిందట స్థానిక బైపాస్‌రోడ్‌లోని ఓ భవనం వద్ద రెండు వర్గాల యువకులు కర్రలతో కొట్టుకున్నారు. హాజీపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి కొంతమందిని బృందంగా ఏర్పరుచుకొని తన రియల్‌ ఎస్టేట్‌, ఇతర లావాదేవీల కోసం వాడుకుంటున్నారన్న ప్రచారం పట్టణంలో ఉంది.’

మంచిర్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఒంటరిగా నడవడం మాట దేవుడెరుగు. పురుషులు కూడా ధైర్యంగా బయటి నుంచి ఇంటికి సురక్షితంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఇటీవల ఆకతాయిల అలజడి ఎక్కువైంది. మంచిర్యాలకు పాకిన విషసంస్కృతి వేళ్లూనకముందే పోలీసులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలను రూపుమాపాలి. రాత్రివేళలో సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ పెంచాలి. మొబైల్‌ టీంలు నిరంతరం గస్తీ నిర్వహించాలి. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన యువతకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెంచాలి. మహిళలు కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.

యువతలో నేర ప్రవృత్తి..

మంచిర్యాలలో కొంతమంది యువతలో నేరప్రవృత్తి ఇటీవల బాగా పెరుగుతోంది. మద్యం, గంజాయి వంటి వాటికి బానిసలు అవుతూ ఎదుటివారిపై అకారణంగా దాడి చేయడం, గాయపరచడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలుచోట్ల ఆకతాయిలు బహిరంగ మద్యం తాగుతూ సమస్యలు సృష్టిస్తున్నారు. ఇటీవల కాలేజ్‌రోడ్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో టీస్టాల్‌ నిర్వాహకులతో గొడవపడి వస్తువులను చిందరవందర చేయడంతో స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. బస్టాండు, రైల్వేస్టేషన్‌తో పాటు కాలేజ్‌రోడ్‌, క్వారీరోడ్‌, శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని బెదిరించి వారి నుంచి డబ్బులు లాక్కోవడం, వారిపై దాడి చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ముఠాకు అడ్డాగా మారింది. రాత్రివేళ వరకు హోటళ్లు, పాన్‌టేలాలతో పాటు మద్యం గొలుసుదుకాణాలు విచ్చలవిడిగా ఉండడంతో అల్లరిమూకలు తమ చేష్టలను విస్తృతం చేస్తున్నారు. మద్యం తాగిన తర్వాత ద్విచక్రవాహనాలపై ఇష్టారీతిన తిరగడం, ప్రశ్నించిన వారిపై దాడులకు, ఘర్షణలకు దిగడం తదితర కార్యకలాపాలతో ప్రజలను భయపెడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా రక్షకభటులు మాత్రం పూర్తిస్థాయిలో వారిపై ఉక్కుపాదం మోపడంలో విఫలమవుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కూడా వారి చేతులు కట్టేస్తున్నాయి. ఎవరిని అరెస్టు చేయడానికి ప్రయత్నించినా వారివెంట ఒక రాజకీయ నాయకుడి నుంచి ఫోన్‌ రావడంతో ఏమీచేయలేక చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రహదారులపైనే జన్మదిన వేడుకలు..

ఇటీవలి కాలంలో యువత తమ జన్మదిన వేడుకలను బహిరంగంగా రహదారులపైనే జరుపుకొంటున్నారు. కేక్‌ కటింగ్‌లతోపాటు బాణాసంచా కాల్చడం, తల్వార్లతో ఫొటోలు దిగడం షరా మాములైంది. రహదారులపై ఈ తతంగం జరిగిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరికొంత మందిని ప్రోత్సహించినట్లవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని