logo

ఎండలతో ఉక్కిరిబిక్కిరి

జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది.

Updated : 18 Apr 2024 05:32 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం : జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతతో పాటు వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎల్‌ నినో ప్రభావంతో ఈ సీజన్‌లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు అయినా.. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా కుమురంభీం, మంచిర్యాల జిల్లాలో 44 డిగ్రీలుగా నమోదైంది.

గడప దాటలేక.. ఉక్కపోత తట్టుకోలేక..

జిల్లాలోని పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిగా తయారయ్యాయి. ఎండ వేడిమితో ఇంట్లో ఉంటే భరించలేనంతగా ఉక్కపోత. ఫ్యాన్‌ కింద కూర్చున్న ఉపశమనం లభించడం లేదు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు అసలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ సమయంలో గాలిలో తేమ శాతం తగ్గి ఉక్కపోత పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలో వాహనదారులు సైతం తమ వాహనాలు చెట్ల కింద నిలిపివేస్తున్నారు. వాతావరణశాఖ లెక్కల మేరకు 45 డిగ్రీలు దాటితే రెడ్‌ అలర్ట్‌ ఉంటుంది. అది ఇంకా ప్రమాదకరం. వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


ఈ ప్రాంతాల్లో భగభగ..

  • ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌, బేల, జైనథ్‌, సిరికొండ, బోథ్‌, మావల, పిప్పల్‌ధరి, చెప్రాల, భోరజ్‌ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
  • కుమురం భీం జిల్లాలో అత్యధికంగా కాగజ్‌నగర్‌లో 44.2 డిగ్రీలు నమోదు కాగా తర్వాత కుంచవెల్లి, రెబ్బెన, పెంచికల్‌పేట్‌, జుంబుగావ్‌, తిర్యాణి మండలాల్లో 43 డిగ్రీలకు పైగా నమోదైంది. బెజ్జూరు, కౌటాల, దహెగాం, కెరమెరి మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉంది.
  • మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం దేవులవాడలో అత్యధికంగా 44 డిగ్రీలు ఉండగా.. చెన్నూరు, కాసిపేట, దండేపల్లి, భీమారం, నస్పూర్‌, ప్రాంతాల్లో 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హాజీపూర్‌, జన్నారం, భీమిని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా నమోదైంది.
  • నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా దస్తూరాబాద్‌లో 43.2 డిగ్రీలు నమోదు కాగా, వానల్‌పహాడ్‌, కడెం, వడ్యాల్‌, ముజ్గి, ఖానాపూర్‌, సారంగపూర్‌, పెద్దూర్‌, భైంసా, కుభీరు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరపరుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని