logo

సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!

నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Published : 18 Apr 2024 03:36 IST

జూన్‌ నుంచి వయోజనుల సర్వతో ముఖాభివృద్ధి కార్యక్రమం
ఉమ్మడి జిల్లాలో 4,72,525 మంది లక్ష్యం
న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్‌

నవ భారత సాక్షరతపై కుమురం భీం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమన్వయ సమావేశం

నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 15ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను లక్ష్యంగా పెట్టుకొని అయిదు దశల్లో వారికి శిక్షణనిచ్చి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతో పాటు నైపుణ్యంతో స్వయం ఉపాధి పొందే శక్తిమంతులుగా మార్చడం ఈ కార్యక్రమ ఉద్దేశంగా భారత మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రకటించింది. ఇందుకోసం కేంద్రం 60శాతం, రాష్ట్రాలు 40శాతం నిధులు వెచ్చించనున్నాయి. ఉమ్మడి జిల్లాలో వచ్చే జూన్‌ నుంచి ఇది అమలు కానుంది. నాలుగు జిల్లాల్లో 4,72,525 మంది నిరక్షరాస్యుల కోసం ఈ కార్యక్రమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందుకోసం నాలుగు జిల్లాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించారు.


జాతీయ నూతన విద్యా విధానం-2020 ప్రకారం.. వచ్చే అయిదేళ్లలో నవ భారత సాక్షరత కార్యక్రమం ద్వారా దేశం సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్నది లక్ష్యం. వయోజన విద్యలో 2018వరకు నిర్వహించిన సాక్షర భారత్‌ కార్యక్రమానికి భిన్నంగా వ్యక్తి సర్వతో ముఖాభివృద్ధి కోసం నూతన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లక్ష్యాన్ని అయిదు దశల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వంద రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు బోధనాభ్యసన సామగ్రి సిద్ధం చేస్తున్నారు.

అమలు తీరు..

ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్థానిక వాలంటీర్ల ద్వారా అమలు కానుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయుల సహకారంతో వాలంటీర్ల ద్వారా వయోజనులకు సాయంత్రం వేళల్లో అక్షరాస్యత అందించనున్నారు. స్థానిక భాషల్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉన్న యువత, ఉన్నత విద్యావంతులను ప్రేరేపించి వాలంటీర్లుగా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయనున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతోనూ ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నారు. లక్ష్యాన్ని అయిదేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదటి ఏడాది నిరక్షరాస్యులు అధికంగా ఉన్న గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.


నేర్పించే అంశాలు..

  • ఎంపిక చేసిన నిరక్షరాస్యులకు మొదటి దశలో (ఫౌండేషనల్‌ లిటరసీ) రాయడం, చదవడం, చిన్నచిన్న లెక్కలు చేయడం నేర్పిస్తారు. వంద రోజుల్లో నేర్పించి 150 మార్కులతో తుది పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి ధ్రువ పత్రాలు ఇస్తారు.
  • రెండో దశలో క్రిటికల్‌ లైఫ్‌ స్కిల్స్‌లో భాగంగా ఆర్థిక అవగాహన, డిజిటల్‌ లిటరసీ, లీగల్‌ లిటరసీలపై శిక్షణనిస్తారు. ఆరోగ్యం రక్షణ, పిల్లల పోషణ, విద్య, కుటుంబ సంక్షేమంపై అవగాహన కల్పిస్తారు.
  • మూడో దశలో బేసిక్‌ ఎడ్యుకేషన్‌గా 3-5 తరగతుల ప్రాథమిక విద్య, 6-8 తరగతులు మాధ్యమిక విద్య, 9-12 తరగతుల సెకండరీ విద్యనందించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
  • నాలుగో దశలో వత్తి నైపుణ్యాలు పెంపొందించే శిక్షణనిచ్చి, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
  • అయిదో దశలో వీరితో స్వయం సహాయక సంఘాల కూర్పు, స్వచ్ఛంద గ్రూపుల ఏర్పాటు, వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించడం

జీవిత పాఠాలు సైతం..
ఎ.శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటి డైరెక్టర్‌ వయోజన విద్య, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నవభారత్‌ సాక్షరత కార్యక్రమం నిరక్షరాస్య వయోజనులకు ఎంతో మేలు చేయనుంది. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కాకుండా జీవన నైపుణ్యాలను నేర్పి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. జూన్‌ నుంచి ఉమ్మడి జిల్లాలో అమలు కానుంది. స్థానికంగా ఉండే విద్యావంతులైన వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తాం. ఇందుకోసం పాఠ్యపుస్తకాలు, బోధనాభ్యసన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. పాఠ్యపుస్తకంలో 124 పేజీల్లో 16పాఠ్యాంశాలను చేర్చారు. అందరి సహకారం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు పూర్తయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని