logo

పార్లమెంట్‌ అంటే తెలుసా?

లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ప్రచారానికి పదును పెడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Published : 22 Apr 2024 04:47 IST

చెన్నూరు పట్టణం, న్యూస్‌టుడే

లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ప్రచారానికి పదును పెడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే లోక్‌సభ, రాజ్యసభను కలిపి పార్లమెంటుగా వ్యవహరిస్తారు. ఆయా సభ్యుల ఎన్నిక, విధివిధానాలు తదితర అంశాలను గురించి తెలుసుకుందాం.


లోక్‌సభ అంటే..

లోక్‌సభను ప్రజాప్రతినిధుల సభ అని కూడా అంటారు. ఇందులో గరిష్ఠంగా 552 మంది సభ్యులు(ఎంపీలు) ఉంటారు. ప్రస్తుతం 543 మంది సభ్యులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీకాలం అయిదేళ్ల వరకు ఉంటుంది. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో లోక్‌సభను రద్దు చేసే అవకాశం ఉంటుంది. సభలోని సభ్యుల నుంచి ఒకరిని సభాసతి(స్పీకర్‌)గా, మరొకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. సాధారణంగా లోక్‌సభ సంవత్సరానికి మూడు పర్యాయాలు(శీతాకాల, వర్షాకాలం, బడ్జెట్‌) సమావేశాల నిర్వహణ ఉంటుంది.

రాజ్యసభ ఇలా..

రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ఆయా రాష్ట్రాల శాసనసభ్యుల సంఖ్యను బట్టి పరోక్షంగా ఎన్నిక జరుగుతుంది. ఇందులో 12 మందిని వివిధ రంగాల్లో(కళలు, భాష, విజ్ఞానం, సేవా రంగాలు) నిపుణులైన వారిలో అత్యున్నత సేవలందించిన వారిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. రాజ్యసభకు ఉపరాష్ట్రపతి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. డిప్యూటీ ఛైర్మన్‌గా ఒకరిని ఎన్నుకుంటారు. ఇందులో సభ్యుల పదవీకాలం ఆరేళ్లు ఉంటుంది. చట్టాల రూపకల్పనలో లోక్‌సభకు సరి సమానమైన అధికారం రాజ్యసభకు ఉంటుంది.

ఎంపీల విధులు, బాధ్యతలు..

సుమారు అయిదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి కలిసి లోక్‌సభ నియోజకవర్గంగా ఉంటుంది. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి భారత పౌరుడై ఉండి, ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరై ఉండాలి. గెలిచిన సభ్యుడు తాను ఎంపికైన నియోజకవర్గ సమస్యలు లోక్‌సభ సమావేశాల్లో చర్చించి వాటి¨ పరిష్కారానికి కృషి చేయాలి. చట్టాల రూపకల్పనలో కీలక భూమిక పోషిస్తారు. బ్యాంకింగ్‌, తపాలా, రైల్వే, విమానయాన, కేంద్రీయ విద్యాలయం, ప్రధాన రహదారులు, తదితర కేంద్ర ప్రభుత్వరంగ ఆధీనంలోని సంస్థల సమస్యల పరిష్కారానికి నిధులు రాబడికి కృషి చేస్తారు. ప్రతి సభ్యుడికి కనీసం రూ.1 లక్ష వేతనం ఉంటుంది(ఇతర అలవెన్సులు మినహా). తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఏటా ప్రత్యేక బడ్జెట్‌ ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి ప్రభుత్వ పెద్దలతో చర్చించి మరిన్ని నిధులు రాబట్టుకునే అవకాశం ఏర్పడుతుంది.


ప్రచార అనుమతులకు ‘సువిధ’

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీˆ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను ఉపయోగించి ఓటింగ్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తోంది. ర్యాలీలు మొదలుకొని ప్రదర్శనల వరకు ఎలాంటి అనుమతులు కావాలన్నా సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ ‘సువిధ పోర్టల్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో అనుమతులు లభిస్తాయి.

వెబ్‌సైట్‌ ద్వారా..

అభ్యర్థులు ముందుగా https://suvidha.eci.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అనంతరం సమావేశాలు, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక పార్టీ కార్యాలయం ఏర్పాటు హెలికాప్టర్‌, హెలీప్యాడ్‌, ఇంటింటి ప్రచారం, బ్యానర్లు, పార్టీ జెండాలు, ఎయిర్‌ బెలూన్లు, వీడియో వ్యాన్‌లు, హోర్డింగ్‌ల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్‌ సమర్పించే వెసులుబాటు సైతం ఉంది. ఆన్‌లైన్‌లోనూ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు