logo

పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు

పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు,

Published : 25 Apr 2024 06:38 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా పాలనాధికారి వెంకటేష్‌ దోత్రే, అదనపు పాలనాధికారులు, అధికారులు

వాంకిడి, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, అదనపు పాలనాధికారులు, ఆర్డీవోలు, ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అధికారి మాట్లాడుతూ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు చీటీలు ప్రతి ఒక్క ఓటరుకు చేరేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. ఓటరు చీటీల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్‌ దోత్రే, అదనపు పాలనాధికారులు దీపక్‌ తివారీ, దాసరి వేణు, జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్‌రావు, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మధుకర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కలియ తిరిగి.. వసతులపై ఆరాతీసి

కాగజ్‌నగర్‌ గ్రామీణం: జిల్లాలో ఎంపిక చేసిన అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని జిల్లా పాలనాధికారి వెంకటేశ్‌ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని జంబుగా పోలింగ్‌ కేంద్రం పరిసరాలను కలియ తిరిగి వసతులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పోలింగ్‌ కేంద్రంలో తాగునీటి వసతి, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుదీకరణకు రూ.2.20 లక్షలు మంజూరు కాగా పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. ఈ భవనం పెచ్చులూడుతున్నందున రూఫ్‌ ట్రీట్‌మెంట్‌ చేయించాలని సూచించారు. పనులు నాణ్యతగా చేపట్టి పోలింగ్‌కు మూడు రోజుల ముందుగానే పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని ఆదేశించారు. భవనం మరమ్మతులు పూర్తయ్యే వరకు సంబంధిత ఏఈ వెంట ఉండి చేయించాలని, దీనిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట అదనపు పాలనాధికారి దీపక్‌ తివారీ, డీఆర్డీఓ సురేందర్‌, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, ఎంపీఓ గౌరీశంకర్‌, కార్యదర్శి లక్ష్మి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని