logo

దిగజారిన ఫలితాలు..

ఇంటర్మీడియట్‌ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.

Published : 25 Apr 2024 06:41 IST

ఇంటర్‌లో గతం కన్నా భిన్న పరిస్థితులు..
వొకేషనల్‌ విభాగంలో.. జిల్లాకు రెండో స్థానం
న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్‌

ఆసిఫాబాద్‌ తెలంగాణ ఆదర్శ కళాశాల విద్యార్థులు తెహ్రీమ్‌, పూజిత, అక్షయలకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న ప్రిన్సిపల్‌ అబ్దుల్‌ ఖలీల్‌

ఇంటర్మీడియట్‌ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. గతేడాది పరీక్షల సమయంలో పేపర్‌ లీకేజీల ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించిన కారణంగా అసలైన ఫలితాలు వచ్చాయని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి నైతం శంకర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో జిల్లాకు రాష్ట్రంలో ఏడో స్థానంలో రాగా.. ప్రథమ సంవత్సర ఫలితాల్లోనూ గతంతో పోలిస్తే అయిదు స్థానాలు దిగజారి 8వ స్థానంలో నిలిచింది. వొకేషనల్‌ విభాగంలో.. రాష్ట్రంలో రెండోస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తమైంది.

జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో.. 4,095 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2,951 మంది ఉత్తీర్ణులై 72.06శాతం ఫలితాన్ని సాధించారు. ప్రథమ సంవత్సరంలో.. 4,570 మంది పరీక్ష రాయగా 2,813 మంది ఉత్తీర్ణులై 61.55శాతం ఫలితాన్ని సాధించారు. ద్వితీయ సంవత్సరం వొకేషనల్‌ కోర్సులో.. 662 మంది పరీక్ష రాయగా 526 మంది ఉత్తీర్ణులై 79.46శాతం ఫలితాలతో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం వొకేషనల్‌ కోర్సులో.. 853 మంది పరీక్షకు హాజరు కాగా 480 మంది ఉత్తీర్ణులై 56.27 శాతం ఫలితాన్ని సాధించారు.

ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల హవా..

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ సంవత్సరంలో తిర్యాణిలోని టీటీడబ్ల్యూఆర్‌జేసీ బాలికల కళాశాల విద్యార్థిని డి.నందిని ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 457 మార్కులు సాధించింది. ఆసిఫాబాద్‌ తెలంగాణ ఆదర్శ కళాశాల విద్యార్థిని ఎ.తెహ్రీమ్‌ సైతం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 457 మార్కులు పొందింది. ద్వితీయ సంవత్సరంలో.. ఎంజేపీబీ బాలికలు గన్నారం కళాశాల విద్యార్థిని ఎం.హేమాదేవి- బైపీసీ విభాగంలో.. 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించింది. ఆసిఫాబాద్‌ తెలంగాణ ఆదర్శ కళాశాల విద్యార్థులు వి.పూజిత, బి.అక్షయ ఎంపీసీ విభాగంలో... 1000 మార్కులకుగాను 983 మార్కులు, జైనూరు జూనియర్‌ కళాశాల విద్యార్థి ఉల్లి అంజలి (ఎంపీసీ) 952 మార్కులు సాధించారు. కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థి ప్రవీణ్‌ సాహా ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 470కి 467 మార్కులు సాధించాడు. వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి కె.సాక్షిత్‌కుమార్‌ ఎంపీసీ ద్వితీయలో 1000కి 964 సాధించి ప్రభుత్వ కళాశాల్లో ఉత్తమ ఫలితం సాధించాడు.

బాలికలదే పైచేయి

ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ప్రథమ సంవత్సరంలో బాలురు 46.83శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 74.04 శాతం మంది పాసై ఆధిపత్యం సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 60.96 శాతం మంది పాసవ్వగా.. బాలికలు 81.95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని