logo

రక్తహీనతతో కస్తూర్బా విద్యార్థిని మృతి

రక్తహీనతతో జి.మాడుగుల కస్తూర్బా విద్యాలయం విద్యార్థిని మృత్యువాతపడింది. విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన వివరాల ప్రకారం.. సింగర్భ పంచాయతీ రచ్చపల్లి గ్రామానికి చెందిన యోహాను, సరస్వతి దంపతుల కుమార్తె చెర్రెకి జెసి గ్రేసీ కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

Published : 27 Mar 2023 04:38 IST

జెసిగ్రేసీ (పాతచిత్రం)

జి.మాడుగుల, న్యూస్‌టుడే: రక్తహీనతతో జి.మాడుగుల కస్తూర్బా విద్యాలయం విద్యార్థిని మృత్యువాతపడింది. విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన వివరాల ప్రకారం.. సింగర్భ పంచాయతీ రచ్చపల్లి గ్రామానికి చెందిన యోహాను, సరస్వతి దంపతుల కుమార్తె చెర్రెకి జెసి గ్రేసీ కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గత నెల 15వ తేదీన పాఠశాలలో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఉపాధ్యాయులు వెంటనే జి.మాడుగుల పీహెచ్‌సీకి, అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. 17న విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తరువాత ఈనెల 7న డిశ్ఛార్జి చేశారు. తల్లిదండ్రులు విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. ఈనెల 10వ తేదీన విద్యాలయ ప్రత్యేకాధికారి పార్వతి, సిబ్బంది రెండు దఫాలుగా రచ్చపల్లి వెళ్లి విద్యార్థినిని పాఠశాలకు పంపించాలని కోరగా.. పూర్తిగా తగ్గలేదని, తగ్గిన తరువాత పంపుతామని చెప్పడంతో ఉపాధ్యాయులు వెనుదిరిగారు. ఈ క్రమంలో ఈనెల 23న జెసిగ్రేసీ మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే కుటుంబసభ్యులు పాడేరు జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నం తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృత్యువాత పడింది. విద్యార్థినికి రక్తహీనతతోపాటు జన్యుపరమైన వ్యాధి ఉందని, మొదట్లోనే గుర్తించి వైద్యసేవలు అందిస్తే బతికేదని వైద్యులు చెప్పినట్లు తండ్రి యోహాను తెలిపారు. విద్యార్థిని మృతితో స్వగ్రామం రచ్చపల్లి, పాఠశాలలో విషాదఛాయలు అలముకున్నాయి. కుమార్తె మృతితో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. విద్యార్థిని అనారోగ్యానికి గురైన నాటి నుంచి వైద్య సేవలు అందిస్తున్నామని, చివరి నిమిషం వరకు పాఠశాల ఆరోగ్య సహాయకురాలు దమయంతి పర్యవేక్షించారని కస్తూర్బా ప్రత్యేకాధికారి పార్వతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని