logo

పక్కా ప్రణాళిక.. పునశ్చరణే కీలకమిక!

విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమైనవి. మంచి కళాశాలలో సీటు సాధించాలంటే మార్కులే గీటురాయి. ఇప్పటికే విద్యార్థులకు ఉపాధ్యాయులు సిలబస్‌లు పూర్తిచేశారు.

Published : 30 Mar 2023 03:10 IST

రాజవొమ్మంగి, ఎటపాక, న్యూస్‌టుడే

రాజవొమ్మంగి గురుకులంలో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థినులు

విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమైనవి. మంచి కళాశాలలో సీటు సాధించాలంటే మార్కులే గీటురాయి. ఇప్పటికే విద్యార్థులకు ఉపాధ్యాయులు సిలబస్‌లు పూర్తిచేశారు. ప్రత్యేక తరగతులతో తర్ఫీదునిచ్చారు. ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. సమయపాలన పాటించడం, చేతిరాత, ఆరోగ్యం తదితర అంశాలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

ఈ ఏడాది ఆరు ప్రశ్నపత్రాలే..

గతంలో మాదిరిగా 11 ప్రశ్నపత్రాలు ఉండవు. ఈ ఏడాది ప్రభుత్వం వాటిని కుదించి ఆరు ప్రశ్నపత్రాలుగా మార్పుచేసింది. సైన్సుకు సంబంధించి జీవ, రసాయన, భౌతిక శాస్త్రాలు ఒకే పరీక్షగా నిర్వహిస్తారు. ఒక్కో విద్యార్థికి ముందుగా 24 పేజీలు ఉండే జవాబు పత్రం ఇస్తారు. అది పూర్తిగా రాసిన విద్యార్థులు కావాలంటే అదనంగా మరో 12 పేజీలు ఉండే జవాబుపత్రం తీసుకోవచ్చు. మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా జవాబు పత్రాలపై వరుస సంఖ్య ఉంటుంది. ఒక విద్యార్థి పత్రాలు, మరొకరి వద్ద ఉంటే సులభంగా గుర్తించి చూసిరాతను అరికట్టవచ్చు.

మంచి చేతిరాతతో మేలు

పరీక్షల్లో చేతిరాత ఎంతో కీలకమైనది. రోజూ రెండు పేజీల్లో గుండ్రంగా, స్పష్టంగా, అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా రాయడం సాధన చేయాలి. పదానికి పదానికి మధ్య ఖాళీ ఉంచాలి. వాక్య నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. సమాధానం రాసేటప్పుడు శీర్షికలు, ఉప శీర్షికలు, ముఖ్యాంశాలు కనిపించేలా కింద గీతలు గీయాలి.

బృంద పఠనంతో మేలు

విద్యార్థులు ఇప్పటివరకు చదివింది ఒక ఎత్తు. పునశ్చరణ మరో ఎత్తు. సబ్జెక్టుల వారీగా తగిన ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి.

బృంద చర్చలు, పఠనంతో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కొత్త విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది. బీ వెనుకబడిన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. పాఠ్యాంశాల్లో ముఖ్యమైన అంశాలకు గీతలు గీస్తూ చదవాలి. బీ మార్కులవారీగా అంటే అర, ఒకటి, రెండు, నాలుగు మార్కుల ప్రశ్నలపై అధికంగా దృష్టిపెట్టాలి.

పరీక్ష గదిలో ఒకటికి రెండుసార్లు ప్రశ్నపత్రం చదివి రాయాలి.


తగినంత నిద్ర అవసరం

- శ్రీదుర్గ, పీహెచ్‌సీ వైద్యాధికారిణి, రాజవొమ్మంగి

తల్లిదండ్రులు పిల్లల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం అందించాలి. చాలా మంది విద్యార్థులు రాత్రులు ఎక్కువగా మేల్కొని చదువుతుంటారు. దీని వల్ల పరీక్ష రాసేటప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉంది. నిద్ర సరిగా లేకపోతే అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచింది. ఆహారం తీసుకోకుండా పరీక్షలకు వెళ్లడం సరైన నిర్ణయం కాదు. టీవీ, చరవాణులకు దూరంగా ఉండాలి.


సమయపాలన తప్పనిసరి

- ఎస్‌.సత్యవేణి, ప్రిన్సిపల్‌, గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, రాజవొమ్మంగి

విద్యార్థులు పరీక్షల్లో సమయపాలన కచ్చితంగా పాటించాలి. కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి. ఆందోళన లేకుండా ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలి. ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రణాళిక ప్రకారం చదవాలి. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు చరవాణి ఇవ్వకూడదు. ఎన్ని గంటలు చదివాం అన్నది కాదు ఎంత బాగా చదివామన్నదే ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని