logo

చినమల్లవరంలో 43 ఎకరాల జీడితోటలు దగ్ధం

ఆర్‌.కొత్తూరు పంచాయతీ చినమల్లవరం గ్రామంలో 8 మంది రైతులకు చెందిన సుమారు 43 ఎకరాల జీడిమామిడి తోటలు మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి.

Published : 17 Apr 2024 01:59 IST

కొయ్యూరు, న్యూస్‌టుడే: ఆర్‌.కొత్తూరు పంచాయతీ చినమల్లవరం గ్రామంలో 8 మంది రైతులకు చెందిన సుమారు 43 ఎకరాల జీడిమామిడి తోటలు మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. కూడా రాజుబాబుకు చెందిన 10 ఎకరాలు, మంగయమ్మ, లక్ష్మి, మాతే పెంటయ్యలకు చెందిన ఆరేసి ఎకరాలు, కూడా పెదవరహాలు 3 ఎకరాలు, లోవ 4, మాతే గంగయమ్మకు చెందిన 4 ఎకరాలు బూడిదయ్యాయి. దిగుబడి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులంతా లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలో అటవీశాఖకు చెందిన వెదురు డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో కొన్ని వెదురు లాటులు (గుట్టలుగా పేర్చిన వెదురు కర్రలు) దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వెళ్లే రహదారిలోని గురుకుల కళాశాల ఎదురుగా వెదురు డిపో ఉంది. దీనిలో వెదురు కర్రలను లాటులుగా పేర్చి వేలం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డిపోలోని కొన్ని లాటులకు నిప్పంటుకుంది. మంటలు భారీగా ఎగిసి పడడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ డిపోకి సమీపంలోనే పెట్రోలు బంకు ఉండటంతో అంతా ఆందోళన చెందారు. వెదురు లాటులు దూరం దూరంగా ఉండటంతో పక్క వాటికి అంటుకోలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.  


అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: కొండపోడుకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడి ఓ గిరిజన వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వై.రామవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలో గొప్పుల తోటమామిడి (జీటీమామిడి) గ్రామానికి చెందిన కోండ్ల అమ్మమ్మ (60) కుటుంబంతో మంగళవారం వ్యవసాయం నిమిత్తం కొండపోడు చేసుకుంటున్నారు. ఈ పనుల్లో భాగంగా తుప్పలకు నిప్పంటించగా, మంటలు చుట్టూ వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఈమెను మారేడుమిల్లి మండలం బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని