logo

224 మందికి 120 గుడ్లు

పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేమితో చిన్నారులకు రుచికరమైన భోజనం అందని పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Updated : 17 Apr 2024 04:48 IST

మధ్యాహ్న భోజనంలో ఎన్నో లోపాలు
న్యూస్‌టుడే, అరకులోయ పట్టణం

పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేమితో చిన్నారులకు రుచికరమైన భోజనం అందని పరిస్థితులు కొనసాగుతున్నాయి. అరకులోయ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ‘న్యూస్‌టుడే’ సోమవారం పరిశీలించింది. పథకం అమల్లో పలు లోపాలు బయటపడ్డాయి.

రకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్లు విద్యార్థులందరికీ సరిపోలేదు. కూరగాయలు కానరాని వెజిటబుల్‌ రైస్‌ వడ్డించారు. ఈ పాఠశాలలో 325 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం 224 మంది పాఠశాలకు హాజరయ్యారు. మెనూ ప్రకారం గుడ్డుకూర, వెజిటబుల్‌ ఫ్రైడ్‌రైస్‌, ఒక చెక్కీ విద్యార్థులకు అందించాల్సి ఉంది. ఒంటపూట బడులు కావడంతో పరీక్ష రాసిన వెంటనే పలువురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. ఉన్నవారిలో కొంతమందికి గుడ్లు పూర్తిగా అందలేదు. 224 మందికి 120 గుడ్లు మాత్రమే పాఠశాల ఉపాధ్యాయులు అందించారని మధ్యాహ్న భోజన నిర్వాహకులు తెలిపారు. 20 కిలోల అన్నం వండినట్లుగా చెప్పారు. వెజిటబుల్‌ ఫ్రైడ్‌ రైస్‌లో అక్కడక్కడ బీట్‌రూట్‌, క్యారెట్‌ ముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. రంగుమారిన ముద్ద అన్నంలో పలచగా ఉన్న గుడ్డు, టమాటా కూరను విద్యార్థులకు అందించారు. అన్నం చాలావరకు మిగిలిపోయింది. మండల విద్యాశాఖ అధికారి-1గా పూర్తిస్ధాయి బాధ్యతలు నిర్వహిస్తున్న మోహనరావు ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. ‘న్యూస్‌టుడే’ పరిశీలిస్తున్న సమయంలో పాఠశాలకు వచ్చిన ఎంఈఓ మోహనరావు గుడ్లు ఎందుకు సరిపడా వండలేదని నిర్వాహకులను ప్రశ్నించారు. ఉపాధ్యాయులు గుడ్లు ఇవ్వలేదని వారు సమాధానం చెప్పారు. కూరలో గుడ్లు అయిపోవడంతో టమాటా చారు మాత్రమే వేశారు. దీనిపై నిర్వాహకులను ప్రశ్నించగా పక్కన మూతపెట్టి దాచిన  20 గుడ్లను చిన్నారులకు అందించారు.


దీనిపై ఎంఈఓ మోహనరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం నిర్వహణ చూసే ఉపాధ్యాయుడికి ప్రేరణ పరీక్ష ఉండటంతో మరో ఉపాధ్యాయుడికి సరకులు ఇచ్చే బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఆయనకు అవగాహన లేకపోవడంతో సమస్య ఏర్పడిందన్నారు. ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


చాలీచాలని పదార్థాలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు 250మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరికి మధ్యాహ్నం చాలీచాలని భోజనం వండుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ‘న్యూస్‌టుడే’ పాఠశాలను సందర్శించగా కేవలం అయిదు కేజీల కిలోల బియ్యంతో ఎగ్‌రైస్‌ను కోడి గుడ్ల కూరను వండారు. వండిన ఆహార పదార్థాలు ఇంతమందికి సరిపోతాయా అని మధ్యాహ్న భోజన నిర్వాహకులను అడగ్గా మధ్యాహ్నం 12.30గంటలకు పాఠశాల ముగిసిన వెంటనే అందరూ ఇంటికి వెళ్లిపోతున్నారని సగం మంది కూడా భోజనం తినడంలేదని బదులిచ్చారు. పూర్తిస్థాయిలో విద్యార్థులకు వండిపెట్టినట్టు మాత్రం తమ రికార్డుల్లో నమోదు చేసుకొంటున్నారు.


రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు 520 మంది విద్యార్థులు చదువుతుండగా 446 మంది హాజరయ్యారు. మెనూలో భాగంగా సోమవారం బిర్యాని, కోడిగుడ్లు కూర అందజేయాల్సి ఉంది. ఈ నెల 1 నుంచి మండలంలోని పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా నిలిచిపోవడంతో గుడ్లకు బదులుగా వంకాయ, బంగాళా దుంప కూర వండారు. పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసేందుకు వీలుగా ప్రత్యేక గది లేకపోవడంతో వరండాల్లో తింటున్నారు. ప్రత్యేక గది ఏర్పాటుచేయాల్సిన ఆవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని